బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మురసు.. భీకరంగా మారిందని.. తీవ్ర తుఫాన్ గా తీరం దాటబోతున్నట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ. ఈ భీకర తుఫాన్ మురసు.. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతూ.. తీరం వైపు దూసుకొస్తున్నట్లు ప్రకటించారు ఏపీ RTGS సీఈవో ప్రఖర్ జైన్.
2026, నవంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి తుఫాన్.. నెల్లూరుకు 160 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై సిటీ తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారాయన. మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే.. ఒంగోలు తీరానికి 210 కిలోమీటర్ల దూరంలో.. మచిలీపట్నంకు 240 కిలోమీటర్ల దూరంలో.. కావలి తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యి ఉన్నట్లు వెల్లడించారు ప్రఖర్ జైన్. గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. తీరం వైపు వస్తున్నట్లు వివరించారాయన. తీరం దాటే సమయంలో ఈదురుగాలలు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు అధికారులు.
గంటకు 22 కిలోమీటర్ల వేగంగా తుఫాన్ కదలిక ఉంటే.. నవంబర్ 3వ తేదీ అంటే మంగళవారం తెల్లవారుజామున ఇది తీరం దాటొచ్చని వెల్లడించారు. నెల్లూరు నుంచి నరసాపురం మధ్య.. ఒంగోలుకు సమీపంలో తుఫాన్ మురసు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆంధ్రా వాతావరణ శాఖ అధికారులు. తీరానికి దగ్గరకు వచ్చే క్రమంలో.. తీరం దాటే ప్రదేశాన్ని కచ్చితంగా అంచనా వేయగలం అని.. ఇప్పటికిప్పుడు తీరం ఎక్కడ దాటుతుందని అని స్పష్టంగా చెప్పలేం అంటున్నారు అధికారులు.
ALSO READ : విశాఖ రుషికొండ తీరానికి కొట్టుకు వచ్చిన బోటు
మురసు తీవ్ర తుఫాన్ గా మారటంతో.. ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. విశాఖపట్నంలోని భోగాపురం విమానాశ్రయం నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ విమాన సర్వీసులను రద్దు చేసింది. అదే విధంగా నరసాపురం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యాకారులు రాబోయే నాలుగు రోజులు వేటకు వెళ్లొద్దని.. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యాకారులు వెనక్కి వచ్చేయాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే రెండు రోజులు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడనున్నట్లు వెల్లడించారు అధికారులు.
