కేంద్ర ఆయిల్ మంత్రి భార్యకు జెనీవాలో రూ.34 కోట్ల అపార్ట్ మెంట్

కేంద్ర ఆయిల్ మంత్రి భార్యకు జెనీవాలో రూ.34 కోట్ల అపార్ట్ మెంట్

కేంద్ర మంత్రి భార్య ఆస్తులు భర్తను మించిపోయాయా? సాధారణంగా భర్తల ఆస్తులే ఎక్కువగా ఉంటాయని మనం భావిస్తుంటాం. కానీ కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన హర్దీప్ పూరి సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే కేంద్ర మంత్రి హర్దీప్ పూరి కంటే ఆయన సతీమణి లక్ష్మీ పూరి వద్దే చరస్తులు, విదేశీ కరెన్సీ రూపంలో భారీ సంపద ఉన్నట్లు తేలింది.

రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారిగా, దౌత్యవేత్తగా, ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారిగా పనిచేసిన లక్ష్మీ పూరి తన పేరిట రూ.10 కోట్ల 66లక్షలు విలువైన చరస్తులను ప్రకటించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి హర్దీప్ పూరి చరస్తుల విలువ రూ.6 కోట్ల 54లక్షలు మాత్రమే ఉన్నాయట. అంతేకాకుండా లక్ష్మీ పూరి బ్యాంకు డిపాజిట్ల విలువ సుమారు రూ. కోటికి పైగానే ఉండగా... హర్దీప్ పూరి బ్యాంకు డిపాజిట్లు కేవలం రూ. 22 లక్షలుగా మాత్రమే ఉన్నాయి.

ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే.. లక్ష్మీ పూరి వద్ద రూ. 9 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో రూ. 34 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్, గ్రేటర్ నోయిడాలో రూ.19 లక్షల 52వేలు విలువైన ఇల్లు ఉన్నాయి. అలాగే ఆమె వద్ద రూ. 2 కోట్ల 75లక్షలు విలువైన విదేశీ కరెన్సీ కూడా ఉన్నాయి. మరోవైపు ఆమె భర్త కేంద్ర మంత్రి హర్దీప్ పూరి వద్ద రూ. 20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయట.

గత 5 ఏళ్లలో వీరిద్దరి ఆదాయం కూడా భారీగా పెరిగింది. లక్ష్మీ పూరి వార్షిక ఆదాయం రూ.15 లక్షల 39వేల నుంచి రూ. కోటి 69లక్షలకు పెరగగా... హర్దీప్ పూరి వార్షిక ఆదాయం రూ. 63 లక్షల 36వేల నుంచి రూ. 75 లక్షల 57వేలకు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి పెన్షన్, జెనీవా ప్రాపర్టీ అద్దెలు లక్ష్మీ పూరి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

నవంబర్ 12న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఇతర బీజేపీ నేతల సమక్షంలో హర్దీప్ పూరి శనివారం తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన ఈ ఆస్తుల వివరాలు ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న భర్తను వెనక్కి నెట్టి, ఆయన సతీమణి కోట్లాది రూపాయల సంపదతో ముందంజలో ఉండటం అసలు చర్చకు కారణమైంది.