కన్నబిడ్డ కోసం ఓ తల్లి పడిన కష్టం అందరినీ కదిలిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన పన్నెండేళ్ల కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఆ తల్లే అంబులెన్సుగా మారింది.విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
విజయనగరం జిల్లాలో కుమార్తెను భుజాన వేసుకుని ఏడు కిలోమీటర్ల దూరం నడిచింది ఓ తల్లి . కొండలు, గుట్టలు దాటుకుంటూ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లి పడిన ఆరాటం గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరతను మరోసారి కళ్లకు కట్టింది.కన్నబిడ్డకు కష్టం వస్తే తల్లి ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందని నిరూపించింది ఓ గిరిజన మహిళ.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుకరమ్మ కుమార్తె సంధ్యారాణి, వయస్సు పన్నెండేళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి సరైన వైద్యం అందించేందుకు ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం, అత్యవసర సమయంలో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో తల్లి సుకరమ్మ తన బిడ్డను భుజాన వేసుకుని ఏడు కిలోమీటర్లు నడిచింది.కొండలు, గుట్టలు దాటుకుంటూ దిబ్బగుంట వరకు చేరుకుంది. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది.అయితే ఈ గ్రామానికి రహదారి నిర్మించేందుకు గతంలో పీఎంజీఎస్వై పథకం కింద సుమారు 4 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలుస్తోంది...
కాంట్రాక్టర్ పనులు చేపట్టినప్పటికీ అనుమతుల గడువు ముగియడంతో రహదారి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మరోవైపు అంచనా వ్యయం 6 కోట్ల 50 లక్షల రూపాయలకు పెరగడంతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.ఇప్పటికీ రహదారి సౌకర్యం లేక గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి ఏడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కోట్ల రూపాయల నిధులు మంజూరైనా రహదారి నిర్మాణం ఎందుకు పూర్తికాలేదు...ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు రహదారి, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
అమ్మ ప్రేమకు హద్దులు లేవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అయితే ఆ తల్లి పడిన కష్టం గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల లోపాన్ని ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితులు మరో కుటుంబానికి ఎదురుకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
