హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముంచుకొస్తోంది. మొన్న ‘అర్నబ్’ ఏపీలో బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు ‘మురాసు’ రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయం తుఫానుగా బలపడింది. ప్రస్తుతం ఈ తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 27 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడనుంది. మంగళవారం నెల్లూరు–నర్సాపురం మధ్య ఏపీ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మురాసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ‘మురాసు’ పేరును మన దేశమే సూచించింది. తమిళ పదమైన మురాసుకు ‘యుద్ధభేరి’ అని అర్థం.
మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్‌లోనూ రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
