తెలంగాణలో నవంబర్ 13 నుంచి ఆర్మీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌ మెంట్ ర్యాలీ.. 33 జిల్లాల యువతకు చాన్స్

తెలంగాణలో నవంబర్ 13 నుంచి ఆర్మీ  రిక్రూట్‌‌‌‌‌‌‌‌ మెంట్ ర్యాలీ.. 33 జిల్లాల యువతకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థుల కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ర్యాలీ నిర్వహించనున్నారు. నవంబర్ 13 నుంచి 24 వరకు జరిగే ఈ ర్యాలీకి సంబంధించిన వివరాలను రక్షణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ ర్యాలీ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌మెన్ (10వ తరగతి ఉత్తీర్ణులు), అగ్నివీర్ ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌మెన్ (8వ తరగతి ఉత్తీర్ణులు) విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

ఆదిలాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. 2027 నియామక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే అడ్మిట్ కార్డులు పొందిన అభ్యర్థులు, అధికారిక నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో సూచించిన అన్ని ధ్రువపత్రాలను ఒరిజినల్ రూపంలో ర్యాలీ కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచించారు. అవసరమైన పత్రాల విషయంలో అభ్యర్థులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

దళారుల మాటలు నమ్మొద్దు: రక్షణ శాఖ

ఆర్మీ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఆటోమేటెడ్ విధానంలో జరుగుతుందని రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే దళారులు, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. సందేహాలు లేదా మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్మీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్యాలయాన్ని 040-27740059 నంబర్‌‌‌‌‌‌‌‌లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.