సిద్దిపేట రూరల్, వెలుగు: బీసీ హాస్టళ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఆదివారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి, సరుకుల సరఫరా, డైట్ బిల్లులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలపై ఆఫీసర్లు, వార్డెన్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అన్ని వసతులతో ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమస్యల్లో చిక్కుకున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు స్కూల్, ప్రీ-మెట్రిక్ హాస్టళ్ల నిర్వహణకు రూ.40 వేలు ఇస్తుంటే, సిద్దిపేటకు కేవలం రూ.10 వేలు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లకు ఇతర జిల్లాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తుండగా, సిద్దిపేటకు రూ.20 వేలే ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.15 కోట్ల రీయింబర్స్‌మెంట్ విడుదల కాగా, ఈ ఏడాది కేవలం రూ.4 కోట్లే ఇచ్చారని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఆఫీసర్లు, హాస్టల్ వార్డెన్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
