గన్నేరువరం, వెలుగు: కూలి పనికి వెళ్లవద్దని తల్లితో గొడవ పడిన కొడుకు సూసైడ్ చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుక నర్సయ్య, రజిత దంపతులకు ఇద్దరు కొడుకులు. మూడేండ్ల కింద నర్సయ్య అనారోగ్యంతో మృతిచెందగా, రజిత కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం రజిత పనికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, తల్లిని వెళ్లవద్దని ఆరో తరగతి చదువుతున్న ఆమె పెద్దకొడుకు జశ్వంత్కోరుతూ వాదించాడు. తల్లి అతడికి నచ్చజెప్పి పనికి వెళ్లింది. పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి జశ్వంత్ ఇంట్లో ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్రెడ్డి తెలిపారు.
