5న కరీంనగర్ కు నితిన్ నబిన్ రాక..ఏర్పాట్లపై నేతలతో చర్చించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

5న కరీంనగర్ కు నితిన్ నబిన్ రాక..ఏర్పాట్లపై నేతలతో చర్చించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

​కరీంనగర్, వెలుగు: ఈ నెల 5న కరీంనగర్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రానున్నారు. సర్ ప్రక్రియకు మద్దతుగా కరీంనగర్ లో వైశ్యా భవన్, టవర్ సర్కిల్, శాస్త్రిరోడ్ మీదుగా కమాన్ వరకు నిర్వహించే పాదయాత్రలో ఆయన పాల్గొననున్నారు. 

ఈ ప్రోగాం ఏర్పాట్లపై చర్చించేందుకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ డి.శంకర్, బాస సత్యనారాయణ, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం సమావేశమయ్యారు. 

నితిన్ నబిన్ పాదయాత్రకు సుమారు 50 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ విదేశీ శక్తులతో, విదేశీ ఆర్థిక సాయంతో బొద్దింక పార్టీ పెట్టిన వాళ్లతో, నేహా బోరా వంటి అరాచక శక్తులతో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 

.ఈ అరాచక శక్తుల కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నామని, అందులో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

కాగా, సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్లలో, ల్యాండ్ విషయంలో కానీ ఎవరిపై ఆరోపణలు వచ్చినా సహించే ప్రసక్తే లేదు. కలెక్షన్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇకపై షాపుల వద్ద కలెక్షన్ చేసినా, డబ్బులు డిమాండ్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.