సింగరేణి పెన్షనర్ల కోసం డీఎల్సీ క్యాంపులు.. నవంబర్2 నుంచి ఏరియాల వారీగా నిర్వహణ

సింగరేణి పెన్షనర్ల కోసం  డీఎల్సీ క్యాంపులు.. నవంబర్2 నుంచి ఏరియాల వారీగా నిర్వహణ
  •     ఈజీగా డిజిటల్​ లైఫ్​సర్టిఫికెట్ల సమర్పణకు అవకాశం

కోల్​బెల్ట్, వెలుగు: ​సింగరేణి రిటైర్డు ఉద్యోగులు, పెన్షనర్లు సులభంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు (డీఎల్​సీ) సమర్పించేందుకు సీఎంపీఎఫ్ (కోల్​మైన్స్​ప్రావిడెంట్​ఫండ్​ఆర్గనైజేషన్), సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నాయి. 

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్- 5.0 పేరుతో నవంబర్ 2 నుంచి 30 వరకు రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల పరిధిలోని సింగరేణి ఏరియాల్లో ఈ క్యాంపులు చేపట్టనున్నారు. ఏటా నవంబర్ లో పెన్షనర్లు జీవన ప్రమాణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 

అయితే అవగాహన లేక, సొంత గ్రామాలకు వెళ్లిపోవడం, ఇతర కారణాలతో పలువురు సకాలంలో సర్టిఫికెట్లు అందించలేక పెన్షన్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎంపీఎఫ్ ఆఫీసర్లు ప్రత్యేక క్యాంపుల ద్వారా ఫ్రీగా డీఎల్​సీలు స్వీకరించనున్నారు. 

గోదావరిఖని సీఎంపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ డాక్టర్ గోవర్ధన్ కాంతేపూడి ఆదేశాల మేరకు ఏరియాల వారీగా క్యాంపులు నిర్వహించనున్నారు. మందమర్రిలో నవంబర్ 2, 3 తేదీల్లో, శ్రీరాంపూర్​లో 4, 5, రామగుండం-–3లో  9, 10, భూపాలపల్లిలో 11, 12, గోలేటీలో 16, 17, రామగుండం–2లో 18, 19, రామగుండం-–1లో 23 నుంచి 25 వరకు క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. 

గోదావరిఖని సీఎంపీఎఫ్ ఆఫీస్​లో నవంబర్ 3 నుంచి 30 వరకు సర్టిఫికెట్లు స్వీకరించనున్నారు. పెన్షనర్లు క్యాంపులకు వచ్చేటప్పుడు పెన్షన్​పేమెంట్​ ఆర్డర్​(పీపీవో) కాపీ, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్​బుక్, ఆధార్​కు అనుసంధానమైన మొబైల్ నంబర్ తీసుకురావాలని ఆఫీసర్లు సూచించారు.

సీపీఆర్ఎంఎస్ రెన్యువల్​కు అవకాశం..


కాంట్రిబ్యూటరీ పోస్ట్​ రిటైర్​ మెడికేర్​ స్కీమ్​(సీపీఆర్ఎంఎస్) మెడికల్ కార్డు రెన్యువల్ కోసం రిటైర్డు ఉద్యోగితోపాటు జీవిత భాగస్వామి కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని, ప్రస్తుతం నిర్వహించే క్యాంపుల్లోనే కార్డు రెన్యువల్​కు అవకాశం కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆళవందార్ వేణుమాధవ్ కోరారు.

పెన్షనర్లకు ప్రయోజనం..


సీఎంపీఎఫ్, సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న డిజిటల్​ లైఫ్​సర్టిఫికెట్​క్యాంపులతో పెన్షన్​ పొందుతున్న రిటైర్డ్​ ఉద్యోగులకు ఈజీగా జీవన్​ ప్రమాణ్​ పత్రం సమర్పించేందుకు వెసులుబాటు కలుగుతుంది. సీఎంపీఎఫ్​ ఆఫీసర్లు సూచించిన అన్ని డాక్యుమెంట్లతో రిటైర్డ్​ ఉద్యోగులు హాజరు కావాలి. 

- ​ మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ-