- ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతులపై అధ్యయనం
నేరడిగొండ, వెలుగు : ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఎస్ఎస్ ట్రైనీ సివిల్ సర్వెంట్లు పల్లెబాట పట్టారు. ఫీల్డ్ ట్రైనింగ్‌లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 4 వరకు ఐదు రోజుల పాటు వీరు ఈ గ్రామంలోనే పర్యటించి, ప్రభుత్వ శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధ్యయనం చేయనున్నారు.
ఈ టీమ్‌లో మయూరి మహల్లే (ఐఆర్ఎస్ జేటీ), మనీషా నహోరా (ఐపీఎస్), ప్రద్యుమన్ సింగ్ బిట్టు (ఐఎఫ్ఎస్), అక్షయ్ కుమార్ శర్మ (ఐఎస్ఎస్), అనురాగ్ విమల్ వర్మ (ఐఎస్ఎస్), మోహిత్ అగర్వాల్ (ఐఎఫ్ఎస్) ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా గ్రామ సర్పంచ్ అగ్గిమల్ల గోదావరి లస్మన్న, ఉప సర్పంచ్ ఆడెపు రవి అధ్యక్షతన గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు.
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక...
పర్యటనలో భాగంగా గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను అధికారుల బృందం పరిశీలించనుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి? వాటి ద్వారా వారి జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఇంకా ఎలాంటి పథకాలు, వసతులు అవసరమనే అంశాలపై ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించనున్నారు. ఈ ఐదు రోజుల క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు శిక్షణాధికారులు తెలిపారు.
