- ఫైనాన్స్ బకాయిలు చెల్లిస్తామంటూ ..
- రైతులను నమ్మించి మహారాష్ట్రకు ట్రాక్టర్ల తరలింపు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేని రైతులను లక్ష్యంగా చేసుకుని, లీజు పేరుతో ట్రాక్టర్లను మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
ఆదివారం ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన యోగేశ్పాటిల్, సోహెల్ రెహాన్, ఆసిఫ్ అనే ముగ్గురు వ్యక్తులు, మరో ఇద్దరు పీతాంబర్, అంబరావులతో కలిసి ముఠాగా ఏర్పడి ఆదిలాబాద్ జిల్లాలోని ఫైనాన్స్ ట్రాక్టర్ యజమానులను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇంద్రవెల్లి, బేల, ఉట్నూర్, తాంసి మండలాల్లో ఫైనాన్స్ బకాయిలున్న రైతులకు టార్గెట్ చేసి, ఆ బకాయిలు తామే చెల్లిస్తామని నమ్మించి 9 ట్రాక్టర్లను లీజుకు తీసుకున్నారు. స్థానికంగా ఉండే కుమ్మరి శ్యామ్ రావు, వాగుమారి కేశవ్, పీతాంబర్, అంబరావ్ అనే వ్యక్తులు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10,000 కమిషన్ తీసుకుంటూ ఈ మోసానికి సహకరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు మహారాష్ట్రలోని అమరావతి, చిక్లీ ప్రాంతాలలో సోదాలు నిర్వహించి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యోగేశ్పాటిల్తో పాటు నలుగురు స్థానిక ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్సై ఇ.సాయన్న పాల్గొన్నారు.
