నేరడిగొండ, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని లఖంపూర్ గ్రామంలో ఆదివాసీల ప్రధాన సాంస్కృతిక పండుగ అయిన ‘దండారి’ ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే ఈ వేడుకలు గ్రామంలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. గ్రామ పటేల్ ఇంటి ముందు ఉన్న పెద్ద జెండా చుట్టూ గుస్సాడి నృత్యానికి సంబంధించిన సంప్రదాయ సామగ్రిని భక్తిశ్రద్ధలతో ఉంచి , నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామ పటేల్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
