హైదరాబాద్: జోగిని సుధాకర్ స్వామి మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుధాకర్ స్వామిని దారుణంగా హత్య చేసి నగలు, డబ్బుతో పారిపోతున్న నిందితులను నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో 2026, అక్టోబర్ 31న జోగిని రాళ్లబండి సుధాకర్ స్వామి (45) దారుణ హత్యకు గురయ్యారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ నగర్ కాలనీలో ఉన్న సుధాకర్ స్వామి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయన కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, గొంతు నులిమి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అనంతరం ఇంట్లో దాచిన దాదాపు 130 తులాల బంగారం, 2.5 కిలోల వెండి, రూ. 9 నుంచి 10 లక్షల నగదు దోచుకున్నారు.
హత్య అనంతరం సుధాకర్ స్వామి కారులోనే నిందితులు సొత్తుతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కారు జీపీఎస్ సిగ్నల్స్ ట్రాక్ చేశారు. కారు నిర్మల్ వైపుగా వెళ్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. చౌటుప్పల్ పోలీసుల సమాచారం మేరకు నిర్మల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే నిర్మల్ రూరల్ ఎస్ఐ లింబాద్రి, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, సూర్యభాను, రఘు, శ్రీధర్‌లతో కలిసి సోన్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
పోలీసులను గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటాడి పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, రూ.9 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం యాదాద్రి జిల్లా పోలీసులకు అప్పగించారు.
చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అస్సాంకు చెందిన పవన్, హర్షుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు పవన్‌కు అస్సాంలోని కామాఖ్య ఆలయం వద్ద సుధాకర్ స్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో కొన్ని రోజులుగా సుధాకర్ స్వామి దగ్గర శిష్యులుగా నమ్మకంగా ఉంటూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
