పెన్షనర్లకు అలర్ట్: నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే పింఛన్ బంద్!

పెన్షనర్లకు అలర్ట్: నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే పింఛన్ బంద్!

డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రయాణ్) సమర్పించేందుకు పెన్షనర్లకు ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. పింఛను ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగాలంటే ప్రతీ ఏటా నవంబర్ 1 నుంచి 30 మధ్య పెన్షనర్లు తమ వార్షిక జీవన సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు మాత్రం అక్టోబర్ 1 నుంచే ఈ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు.

ఈ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించడం చాలా ఈజీ. పెన్షనర్లు తమకు పింఛను అందిస్తున్న సంబంధిత బ్యాంకు శాఖలను నేరుగా వెళ్లి దీన్ని అందించవచ్చు. ఒకవేళ బ్యాంకులకు వెళ్లలేని పరిస్థితి ఉంటే.. డిజిటల్ విధానాలను కూడా ఎంచుకోవచ్చు. 'జీవన్ ప్రమాణ్' పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంట్లోనే ఉండి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇంటి నుంచే సమర్పించే వీలు అందుబాటులో ఉంది.

అలాగే టెక్ పరిజ్ఞానం తక్కువగా ఉన్న వృద్ధుల కోసం ప్రత్యేక సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ , కామన్ సర్వీస్ సెంటర్లు అందించే డోర్‌స్టెప్ సర్వీసుల ద్వారా కూడా తమ ఇంటి నుంచే ఈ ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేయవచ్చు. పోస్టల్ సిబ్బంది లేదా నిర్దేశిత ఏజెన్సీలు నేరుగా పెన్షనర్ల ఇంటికి వచ్చి బయోమెట్రిక్, ఫేస్ స్కాన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

ALSO READ : రోజుకు లక్ష కోట్ల రూపాయల UPI లావాదేవీలు 

నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి పింఛనుదారులు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వెంటనే తమ సర్టిఫికెట్‌ను సమర్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛను పొందాలని అధికారులు సూచిస్తున్నారు.