రోజుకు లక్ష కోట్ల రూపాయల UPI లావాదేవీలు : భూమిపైనే ఇది రికార్డ్

రోజుకు లక్ష కోట్ల రూపాయల UPI లావాదేవీలు : భూమిపైనే ఇది రికార్డ్

డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారత్ మరో అరుదైన మైలురాయిని నమోదు చేసింది. దేశంలో UPI చెల్లింపులు సరికొత్త చరిత్ర సృష్టించాయి. అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టాయి. పండుగ సీజన్ కావడంతో ప్రజల కొనుగోళ్లు విపరీతంగా పెరిగి, డిజిటల్ చెల్లింపులు భారీగా నమోదయ్యాయి.

రూ.30 లక్షల కోట్లకు పైగా:
అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ రికార్డు స్థాయిలో రూ.31 లక్షల 53వేల కోట్లకు చేరింది. యూపీఐ చరిత్రలో ఈ మార్కు దాటడం ఇదే మొదటిసారి. అంతకుముందు మే 2026లో అత్యధికంగా రూ.29 లక్షల 90వేల కోట్ల విలువైన లావాదేవీలు జరగగా.. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. ఇక సగటున రోజువారీ లావాదేవీల విలువ మొదటిసారిగా రూ.లక్ష కోట్లను దాటేసింది.

సంఖ్యల పరంగా గ్రోత్:
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. అక్టోబర్‌లో యూపీఐ ఏకంగా 25.47 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అంటే రోజుకు సగటున 821 మిలియన్ల లావాదేవీలు జరిగాయన్నమాట. ఆగస్టులో నమోదైన 24.5 బిలియన్ల లావాదేవీల రికార్డును ఇది వెనక్కి నెట్టింది. మన దేశంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా దాదాపు 89 శాతంగా ఉండటం దాని రీచ్‌ని తెలియజేస్తోంది.

MDR ఛార్జీల వాయిదా:
వ్యాపారులకు చేసే డిజిటల్ పేమెంట్స్‌పై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) ఛార్జీలను ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. అయితే దీపావళి పండుగ సీజన్ ముగిసే వరకు ఈ ఛార్జీల అమలును వాయిదా వేశారు. రూ. 2వేల కంటే ఎక్కువ విలువైన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని సెప్టెంబర్ లో యూపీఐ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ఛార్జీల ద్వారా బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు దాదాపు రూ. 15వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా. అయితే యూపీఐపై రుసుము వ్యాపారులను క్యాష్ మార్కెట్ దిశగా నడిపిస్తుందనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. 

ALSO READ : వెయ్యి పాయింట్ల లాభంలో స్టాక్ మార్కెట్ : బుల్ జోరుకు కారణాలు ఇవే!

భవిష్యత్తుపై అంచనాలు:
యూపీఐ లావాదేవీలు ఈ స్థాయిలో పెరగడం భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపుల వేగానికి అద్దం పడుతోంది. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందరూ యూపీఐని ఎంత బలంగా నమ్ముతున్నారో ఇది నిరూపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో అమలుకానున్న ఎండీఆర్ ఛార్జీల నిబంధనలు డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. ప్రైస్ సెన్సిటివ్ ఇండియన్ మార్కెట్లో ఉచిత సేవలను పెయిడ్ చేస్తే అది ఎంత పెద్ద మార్పులకు దారితీస్తుందనేది వేచి చూడాల్సిన అంశమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.