వెయ్యి పాయింట్ల లాభంలో స్టాక్ మార్కెట్ : బుల్ జోరుకు కారణాలు ఇవే!

వెయ్యి పాయింట్ల లాభంలో స్టాక్ మార్కెట్ : బుల్ జోరుకు కారణాలు ఇవే!

గత నెల భారీగా నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నవంబర్ ప్రారంభంలో బుల్ జోరుతో కళకళలాడుతున్నాయ్. సోమవారం ఉదయం 10.53 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1081 పాయింట్ల లాభంతో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 304 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇక నిఫ్టీ  బ్యాంక్ సూచీ 232 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 613 పాయింట్ల లాభంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, మ్యాక్స్ హెల్త్ కేర్ స్టాక్స్ టాప్ గెయినర్లుగా ఇంట్రాడే ట్రేడింగ్ లో కొనసాగుతున్నాయి. మార్కెట్ల పరుగుకు కారణాలు పరిశీలిస్తే..

1. రిలయన్స్ షేర్ల దూకుడు:
సోమవారం ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 6 శాతానికి పైగా లాభపడ్డాయి. కంపెనీ ప్రకటించిన రికార్డు స్థాయి క్యూ2 ఫలితాలు, బ్రోకరేజ్ సంస్థల నుంచి వస్తున్న సానుకూల నివేదికలే దీనికి ప్రధాన కారణం. దీంతో రిలయన్స్ షేరు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో మోస్ట్ యాక్టివ్ స్టాక్‌గా నిలిచింది. గోల్డ్‌మన్ సాచ్స్, నొమురా వంటి దిగ్గజ సంస్థలు దీనికి Buy రేటింగ్ కొనసాగించాయి. దీంతో అంబానీ కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.16లక్షల 77వేల కోట్లకు చేరుకుంది. 

2. తగ్గిన ముడి చమురు ధరలు:
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3 శాతం తగ్గి బ్యారెల్‌కు 110 డాలర్లకు పడిపోయింది. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల నేపథ్యంలో గతంలో 118 డాలర్లుగా ఉన్న క్రూడ్ ధర ఇప్పుడు 110 డాలర్లకు తగ్గడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. అలాగే యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గడం కూడా సానుకూల పరిణామమని నిపుణులు చెబుతున్నారు.

3. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు:
భారతీయ మార్కెట్లపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FIIs) మళ్లీ నమ్మకం చూపుతున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే వీరు రూ.3వేల 598 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం దేశీయ మార్కెట్లకు ఇవాళ సపోర్ట్ గా నిలిచింది.

4. అంతర్జాతీయ మార్కెట్లలో జోరు:
ఏషియన్ మార్కెట్లు అన్నీ లాభాల్లో పయనిస్తున్నాయి. సౌత్ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ, షాంఘై, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా లాభాల్లో ఉండటంతో అమెరికా మార్కెట్లు కూడా బలంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

5. బలమైన Q2 ఫలితాలు:
కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించి వస్తుండటం మార్కెట్‌కు జోష్ ఇస్తోంది.

* బ్యాంక్ ఆఫ్ బరోడా: అంచనాలను తలకిందులు చేస్తూ నికర వడ్డీ ఆదాయం, కోర్ లాభాల్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో దీని షేర్లు 3.5 శాతం పెరిగాయి. అంతేకాదు 2027 ఆర్థిక సంవత్సరానికి తమ వృద్ధి అంచనాలను కూడా బ్యాంక్ పెంచింది.

* ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్: ప్రభుత్వ సాయం తోడ్పాటుతో ఐఓసీ సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభం దాదాపు 3 రెట్లు పెరగడంతో, షేర్లు 3 శాతం లాభపడ్డాయి.

మొత్తానికి బలమైన కార్పొరేట్ కంపెనీల క్యూ2 ఫలితాలు, తగ్గిన క్రూడాయిల్ ధరలు, విదేశీ పెట్టుబడులు అన్నీ కలిసి ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చాయనే చెప్పుకోవాలి.