ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చింది: మైలార్ దేవ్‎పల్లిలో ఉరివేసుకుని 8 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చింది: మైలార్ దేవ్‎పల్లిలో ఉరివేసుకుని 8 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

8 సంవత్సరాల వయస్సు. ఈ ఏజ్‎లో పెద్దగా కష్టాలు, బాధల గురించి కూడా ఏమి తెలియదు. స్కూల్‎కు వెళ్తూ సరదాగా ఫ్రెండ్స్‎తో ఆడుకునే స్టేజ్. కానీ ఈ వయస్సులో ఓ బాలుడు ఎవరి తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ ఎనిమిదేళ్ల వయస్సులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు మైలార్‎దేవ్‏పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఓ కార్మిక కుటుంబం హైదరాబాద్‎కు వలస వచ్చింది. నగర శివారు మైలార్‎దేవ్‎పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో నివాసం ఉంటుంది. వీరికి ఐదు సంవత్సరాల బాలిక, ఎనిమిది సంవత్సరాలు కొడుకు ఉన్నారు. కాటేదాన్‌లోని ఓ కంపెనీలో భార్యభర్తలు పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే ఆదివారం (నవంబర్ 1) భార్యభర్తలు పనికి వెళ్లారు. తల్లిదండ్రులు పని వెళ్లిన సమయంలో ఎనిమిదేళ్ల కుమారుడు ఇంట్లో ఫ్యాన్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులు కొడుకు ఫ్యాన్‎కు వేలాడుతూ ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికే కొడుకు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించారు. మైలార్‎దేవ్‎పల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.