పంజాబ్‎లో ఆప్‎కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు

పంజాబ్‎లో ఆప్‎కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు

చంఢీఘర్: పంజాబ్‎లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ , హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా,  చేతన్ సింగ్ జౌరమజ్రా సోమవారం (నవంబర్ 2) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీకి ఈ పరిణామం బూస్ట్ ని ఇవ్వగా.. అధికార ఆప్‎కు మాత్రం భారీ ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 

2027 ఫిబ్రవరి, మార్చి నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగానే అధికార ఆప్ ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే 40 నియోజకవర్గాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. 

40 మందితో ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఈ జాబితా ప్రకటించిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, సమనా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్రా, అమృత్‎సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ ఆప్‎కు గుడ్ చెప్పారు. టికెట్ కేటాయింపులపై తీవ్ర అసంతృప్తితోనే వీరంతా పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యారు. వీరి బాటలోనే మరికొందరు నేతలు సైతం నడవనున్నట్లు పంజాబ్ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుసగా ఆప్‎ను వీడటంతో పంజాబ్ లో కొత్త రాజకీయం మొదలైంది.