ఎంత తాగితే మాత్రం.. ఎంత మందు కొడితే మాత్రం.. కొడుకు అన్న సోయి ఉండదా.. కొడుకు అన్న ప్రేమ ఉండదా.. కొడుకు అన్న జ్ఞానం ఉండదా ఏంటీ.. తప్పతాగి రాత్రి ఇంటికి వచ్చి కొడుకును కొట్టి చంపాడు ఓ తండ్రి. హైదరాబాద్ సిటీ బోరబండలో జరిగిన ఈ దారుణం అందర్నీ షాక్కు గురి చేసింది. ఎంత తాగితే మాత్రం కన్న కొడుకు అలా ఎలా చంపాడు అంటూ స్థానికులు అందరూ అవాక్కవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బోరబండలోని శిల్పినగర్లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మద్యం మత్తులో కన్న కొడుకును చంపాడు. విద్యాసాగర్ (36), దుర్గ భార్యభర్తలు. వీరికి విజయ్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. బోరబండలోని శిల్పినగర్లో నివాసం ఉంటున్నారు. నవంబర్ 1వ తేదీ రాత్రి ఫుల్గా తాగొచ్చిన విద్యాసాగర్ మద్యం మత్తులో కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు.
క్యాటరింగ్ పనికి వెళ్లిన దుర్గా తెల్లారి ఇంటికి వచ్చేసరికి కొడుకు అచేతనంగా పడి ఉండటాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించింది. బాలున్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తండ్రే కుమారున్ని గొంతు నులిమి హత్య చేశాడని పొరుగువారి సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు పరార్ అయ్యాడు. బోరబండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
