పొయెట్రీ కార్నర్ : నరం లేని నాలుక

పొయెట్రీ కార్నర్ : నరం లేని నాలుక

లోకులు ఏం అనుకుంటారో అని..
నీ యాత్రకు బ్రేకులు వేయకు
నీవు గెలిస్తే ఈర్ష్య వర్ష వడగళ్లు
ఓడితే ఎగతాళి సునామీ చేష్టలు 
కురిపిస్తుంది నడమంత్రపు నర నాలుక!

అదృష్టాన్ని నమ్మి కూర్చుంటే..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే 
గమ్యం వైపు వడివడిగా నడిస్తే..
అదృష్టం నీ వెంట నీడలా వస్తుంది
పరిగెత్తే జలమే సాగర గమ్యం చేరుద్ది!

పేదోడి పళ్లెం సగం ఖాళీ ఉన్నా..
మదిలో తనోళ్లపై బొచ్చెడు ప్రేమలు
ఉన్నోడి పళ్లెంలో అన్నీ ఉన్నా..
మనసులో ఎవరూ లేరనే వెలితి
పేదోడి పేగుల్లో ఎలుకలు పరుగెడితే.. 
ఉన్నోడి ఒళ్లంతా బిపీ, షుగర్ పరుగులే!

మనిషి ఓ దుకాణం అయితే..
తన నోరు ఓ తాళం అవుతుంది 
నోటి తాళం తెరిస్తే గాని..
అది వజ్ర వైఢూర్యాల దుకాణమో...
ఇనుప ముక్కల దుకాణమో తెలియదు!
వేసుకున్న దుస్తుల్లో లేదు విలువ
నీ మాటల జ్ఞాన లోతుల్లో ఉంది నేస్తం!!

- మధుపాళీ
 -