బెర్లిన్: యూరప్భగ్గుమంటోంది. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన జెన్‌జీ ఉద్యమం ఇటలీ, స్పెయిన్ మీదుగా తాజాగా జర్మనీకి కూడా పాకింది. జీవన వ్యయం, విద్యారంగంలో మౌలిక వసతుల కొరత, నిర్బంధ సైనిక సేవ వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాదిమంది యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. జర్మనీవ్యాప్తంగా ‘జెన్ జెడ్’ చేపట్టిన ఈ భారీ నిరసనలు హింసాత్మకంగా మారాయి. అల్లరిమూకలు పెట్రోల్ బాంబులు విసరడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఆందోళనలను అదునుగా చేసుకొని కొందరు దుండగులు ఫ్రాంక్‌ఫర్ట్‌లో షాపులను లూటీ చేశారు. దుకాణాల్లోకి చొరబడి లగ్జరీ వస్తువులను దోచుకున్నారు. వాహనాల అద్దాలు పగలగొట్టి.. బారికేడ్లకు నిప్పు పెట్టారు. ‘జెన్-జీ రెగెల్ట్’ (జెన్-జీ టేక్స్ చార్జ్) ప్రచారం సంస్థ పిలుపు మేరకు రాజధాని బెర్లిన్‌తో పాటు ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా దాదాపు 34 నగరాల్లో ఈ ర్యాలీలు జరిగాయి. సంప్రదాయ రాజకీయ పార్టీల తీరుపై విసిగిపోయిన యువత సోషల్ మీడియా వేదికగా ఒక్కటై ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు.
ప్రజలకు ఆర్థిక భద్రత, మెరుగైన ప్రజా సేవలు అందించాలని, నిరంతరం పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. హాలోవీన్ వేషధారణలతో విద్యార్థులు, యువ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలపై వినూత్న రీతిలో తమ నిరసనను గళం విప్పారు. శనివారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో జరిగిన ర్యాలీలో లక్షా అరవై వేలకు పైగా యువత పాల్గొన్నారు. అయితే, నిరసన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో నిరసనకారులు పలు దుకాణాల అద్దాలను పగులగొట్టి సరుకులను లూటీ చేశారు. పోలీసులపై రాళ్లు, మొలోటోవ్ కాక్‌టైల్స్ (పెట్రోల్ బాంబులు) విసిరారు. కొలోన్, . హంబర్గ్‌లో బారికేడ్లను తగలబెట్టారు. స్టుట్‌గార్ట్ వంటి నగరాల్లోనూ నిరసనల ముగింపు సమయంలో కొన్ని ఘర్షణలు జరిగాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు వాటర్ కేనన్లు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించారు. ఫ్రాంక్‌ఫర్ట్ సిటీ సెంటర్‌కు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. షాపింగ్ వీధులను మూసివేశారు.
ప్రభుత్వాల అప్రమత్తం
యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో జర్మనీ ఒకటి. మనం బలప్రయోగం కోసం కాకుండా శాంతి, స్వేచ్ఛ కోసం పోరాడటానికి ఇక్కడ ఉన్నామని బెర్లిన్‌లో జరిగిన ర్యాలీలో జెన్ జీ రెగెల్ట్ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ అన్నారు. ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మద్దతు అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు. మరోవైపు జాతి వ్యతిరేక శక్తులు ఆందోళనకారుల్లో కలిసి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని జర్మనీ ఫెడరల్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది.
ఈ నిరసనలను అణచివేయాలని.. లేదంటే పరిస్థితులు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని యువతను హెచ్చరించింది. దోపిడీలు, దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది. ఫ్రాన్స్‌లో గతంలో జరిగిన లూటీలు, అల్లర్ల తరహా వాతావరణం జర్మనీకి రాకూడదని హెస్సే రాష్ట్ర హోం మంత్రి రోమన్ పోసెక్ తీవ్రంగా మందలించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నంత వరకు అభ్యంతరం లేదని, అయితే హింసాత్మక ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ భారీ నిరసనల నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వ కూటమి అత్యవసర సమావేశమై యువత సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఫ్రాన్స్‌లో మొదలైన నిరసనలు యూరప్‌లోని ఇతర దేశాలకూ విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
