న్యూఢిల్లీ, వెలుగు: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్) పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు, సీఈసీకి శిక్ష తప్పదని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. తక్షణమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ర్యాలీకి హాజరయ్యేందుకు తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను తెలంగాణ భవన్‌లో వివేక్ కలిసారు.
ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అడ్డగోలుగా వ్యవహరిస్తూ, ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగిస్తూ అన్యాయానికి పాల్పడుతుందని మండిపడ్డారు. సర్ పేరుతో ఓట్ చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు.
దీన్ని గమనించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారని చెప్పారు. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్ చోరీపై ఆందోళనలు చేపట్టి, ప్రజల్లో చైతన్యం నింపుతుందన్నారు. ‘ఓట్ బచావో–దేశ బచావో’ పేరుతో చారిత్రాత్మక రామ్ లీలా మైదాన్ నుంచి కొత్త ఉద్యమం ప్రారంభం కాబోతుందని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు అగ్రనేతల సందేశాన్ని దేశ
వ్యాప్తంగా తీసుకెళ్లాలన్నారు.
