విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కంగనా రనౌత్ మరోసారి హారర్ జానర్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ హీరో, నిర్మాత రానా దగ్గుబాటి నిర్మించనుండగా.. డిఫరెంట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు రవిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
‘స్కేరీ పిక్చర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాను హిందీలో తెరకెక్కించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును రానా దగ్గుబాటి తాజాగా అధికారికంగా ప్రకటించాడు. ఢిల్లీలో జరిగిన హారర్ కాన్ ఇండియా 2026 కార్యక్రమంలో ఈ సినిమాను రానా ప్రకటించాడు. ‘స్కేరీ పిక్చర్’ టైటిల్‌ను కూడా అక్కడే రివీల్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవిబాబుతో తనకున్న స్నేహాన్ని ప్రస్తావించిన రానా.. ఆయన తెలుగులో ఇప్పటికే పలు హారర్ సినిమాలు తెరకెక్కించారని, ఇప్పుడు తొలిసారిగా హిందీ ఫీచర్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించనున్నారని తెలిపాడు.
ఇక ఇప్పటికే నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన కంగనా.. ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హారర్ కథాంశంలో ఆమె నటన ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆమె గతంలో హారర్ జానర్‌లో ‘రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్’ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి 2’లోనూ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మరోసారి హారర్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా కథ, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్, షూటింగ్ డీటెయిల్స్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
