న్యూఢిల్లీ/ బెంగళూరు: దేశీయ ప్రయాణికులకు రైల్వే శాఖ మరో అదిరిపోయే శుభవార్త అందించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి.
బెంగళూరు – ముంబై నగరాల మధ్య రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే ఈ సరికొత్త రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. 16 కోచ్‌లతో కూడిన ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరులోని సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎమ్ వీటీ) నుంచి బయల్దేరింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రులు వి.సోమన్న, శోభా కరంద్లాజే, ఎంపీలు తేజస్విసూర్య, పీసీ మోహన్, సీఎన్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
రైలు రాకపోకల వివరాలు..
ఈ రైలు సాధారణ రాకపోకలు ముంబై–బెంగళూరు మార్గంలో నవంబర్ 2 నుంచి, బెంగళూరు-–ముంబై మార్గంలో నవంబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లే రైలు సోమవారం మినహా, ముంబై నుంచి బెంగళూరు వచ్చే తిరుగు ప్రయాణ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు సేవలు అందిస్తాయి. ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా రైల్వే శాఖ మరో కానుకను అందించింది. వారణాసి – న్యూఢిల్లీ మధ్య దేశంలోనే సరికొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్‌కు పీఎం మోదీ గ్రీన్‌సిగ్నల్
ఉత్తర, తూర్పు భారతదేశంలో రవాణా రంగాన్ని పూర్తిగా మార్చివేసే ప్రతిష్టాత్మక 'నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్' ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడంతోపాటు విద్యార్థులు, వ్యాపారులు, వైద్యం కోసం ప్రయాణించే రోగులకు ఎంతో ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
