సమ్మెలో ఉద్యోగులు..నిలిచిన వైద్యం..20 రోజులుగా రోడ్డెక్కిన 17 వేల మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు

సమ్మెలో ఉద్యోగులు..నిలిచిన వైద్యం..20 రోజులుగా రోడ్డెక్కిన 17 వేల మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులు
  •     డాక్టర్​ నుంచి కాంటిజెంట్​ వర్కర్ వరకు విధులకు దూరం
  •     రెగ్యులరైజ్, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్​హెచ్ఎం) కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. పల్లె దవాఖానలు, యూపీహెచ్సీలలో సేవలందించే మెడికల్ ఆఫీసర్ల నుంచి కాంటిజెంట్ వర్కర్ల వరకు 78 క్యాడర్లలోని 17 వేల మందికి పైగా సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. దీంతో వివిధ సర్కారు దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలపై ఎఫెక్ట్ పడుతున్నది. ఏండ్ల తరబడి అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామని, తమ  న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలివేస్తామని హెచ్చరిస్తున్నారు. 

పిల్లలకు వాక్సినేషన్ ఇబ్బందులు

ఉద్యోగుల సమ్మె ప్రభావంతో ప్రైమరీ, అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, పల్లె, బస్తీ దవాఖానాలు, టీ-డయాగ్నోస్టిక్స్, బ్లడ్, మిల్క్ బ్యాంకుల్లో సేవలు దాదాపు స్తంభించాయి. సాధారణ ఓపీ వైద్యం, బ్లడ్–యూరిన్ టెస్టులు, గర్భిణుల తనిఖీలు, ప్రసవాలు, పిల్లల వ్యాక్సినేషన్, బీపీ, షుగర్ టెస్టులు నిర్వహణ వంటి నిత్య సేవలు ముందుకు సాగడం లేదు. గతంలో ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలను 31 శాతం నుంచి 70 శాతానికి పెంచడంలో, మాతా–శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో తామే కీలకంగా  వ్యవహరించినట్లు ఎన్ హెచ్ఎం ఉద్యోగులు చెబుతున్నారు. టీబీ నిర్మూలన, కరోనా విపత్తు వంటి క్లిష్ట సమయాల్లో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తించిన మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు,సెకండ్ ఏఎన్‌‌‌‌‌‌‌‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు ధర్నాలో పాల్గొంటున్నారు.

రెగ్యులరైజేషనే ప్రధాన అజెండా 

తమ సుదీర్ఘ పోరాటంలో ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తొలి డిమాండ్‌‌‌‌‌‌‌‌ అని  ఎన్​హెచ్ఎం ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం సిబ్బందిని వివిధ విధానాల ద్వారా రెగ్యులర్ చేయడమో లేదా శాశ్వత సేవా భద్రత కల్పించడమో చేశారని జేఏసీ గుర్తుచేస్తోంది. అదే తరహాలో తెలంగాణలోనూ రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడకుండా 17 వేల మంది సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సరైన క్యాడర్ ఫిక్సేషన్ చేపట్టి వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేయాలని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలి
థర్డ్ పార్టీ ఏజెన్సీలను రద్దు చేసి అందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ (ఎస్ హెచ్ఎస్) పరిధిలోనే కొనసాగించాలని, స్పర్శ్ పోర్టల్ ద్వారా ప్రతినెలా 5వ తేదీలోపే ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2022 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లాయల్టీ బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నినదిస్తున్నారు. వీటితో పాటు మహిళా ఉద్యోగులందరికీ క్యాడర్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్), ప్రమాదవశాత్తు చనిపోయిన సిబ్బంది కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌ గ్రేషియాతో పాటు కారుణ్య నియామకం ద్వారా ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. జీవో నెంబర్ 60ని ఇంప్లిమెంట్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.