హైదరాబాద్‎లో గ్రీన్ ట్యాంకర్ల సేవలు షురూ .. తొలివిడతలో 28 ట్యాంకర్లు

హైదరాబాద్‎లో గ్రీన్ ట్యాంకర్ల సేవలు షురూ .. తొలివిడతలో 28 ట్యాంకర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జలమండలి గ్రీన్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం సెక్రటేరియెట్​ఆవరణలో ఎండీ అశోక్ రెడ్డి ట్యాంకర్లను ప్రారంభించారు. సీఎంసీ, ఎంఎంసీల్లోనూ ఆయా కమిషనర్లతో పాటు జలమండలి ఈడీలు గ్రీన్ ట్యాంకర్లను ప్రారంభించారు. నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌‌‌‌‌‌‌‌ స్కేపింగ్‌‌‌‌‌‌‌‌, గార్డెనింగ్‌‌‌‌‌‌‌‌ తదితర తాగునీటితో అవసరం లేని పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు.

 తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎండీ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింటెనెన్స్, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగునీటిని వాడుతున్నారని, దీనికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయడంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, పార్కులు, గ్రీనరీ అవసరాలకు గ్రీన్ వాటర్ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తామన్నారు. 

తొలివిడతలో 28 ట్యాంకర్లు..

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 19 ఎస్టీపీల నుంచి గ్రీన్ వాటర్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. అత్తాపూర్‌‌‌‌‌‌‌‌లో 5, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌లో 3, మీరాలంలో 2, నాగోల్‌‌‌‌‌‌‌‌లో 2, ముల్కత్వ చెరువు వద్ద 2, నల్లచెరువు వద్ద 2, హుస్సేన్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ ఎస్టీపీ వద్ద 2 ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. కోకాపేట్‌‌‌‌‌‌‌‌, గోపన్‌‌‌‌‌‌‌‌పల్లి, లింగంకుంట తదితర ప్రాంతాల్లోని ఎస్టీపీల నుంచి కూడా సరఫరా చేపట్టనున్నారు. సరూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, గోపన్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌, ఖాజాగూడ, నానక్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌గూడ, మియాపూర్‌‌‌‌‌‌‌‌-పటేల్‌‌‌‌‌‌‌‌ చెరువు, వెన్నెలగడ్డ తదితర ప్రాంతాల ఎస్టీపీలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నారు.

మరో 100 ట్యాంకర్ల నమోదు..

గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించేందుకు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన సుమారు 100 ట్యాంకర్లు ఇప్పటికే జలమండలి వద్ద నమోదు చేసుకున్నాయి. వీటి ద్వారా కూడా దశలవారీగా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనున్నారు. ట్యాంకర్ల బుకింగ్‌‌‌‌‌‌‌‌, కేటాయింపుల్లో పారదర్శకత కోసం జీపీఎస్‌‌‌‌‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌, ఈ-పీఓఎస్‌‌‌‌‌‌‌‌ విధానాలను అమలు చేయనున్నారు. ఎస్టీపీల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించి ఫిల్లింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు, నీటి నాణ్యత, ట్యాంకర్ల నిర్వహణ, సరఫరా ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. 

37 ఏళ్లలో భారీగా విస్తరించిన సేవలు..

జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి ఎండీ అశోక్‌‌‌‌‌‌‌‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత 167 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగర ప్రజలకు తాగునీటి సేవలు అందించేందుకు ఏర్పాటైన జలమండలి, ప్రస్తుతం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించిందని పేర్కొన్నారు. గత 37 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి, విజయాలు, పురస్కారాలు సాధించిందన్నారు.