- ఓట్ చోరీతోనే ఆ పార్టీ గెలవాలని చూస్తోందని ఆరోపణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పనున్నారని పేర్కొన్నారు. ఓటు చోరీకి పాల్పడుతూ, ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు. దేశంలో మార్పు అనివార్యమని, బీజేపీకి యువత తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. రామ్లీలా మైదానం ప్రజాస్వామ్య ‘హల్దీఘాటి’గా మారిందని, ఇక్కడి నుంచే సరికొత్త చరిత్రకు నాంది పలుకుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులకు వ్యతిరేకంగా ఇండియా కూటమి, దాని భాగస్వామ్య పక్షాలన్నీ ఏకమయ్యాయని చెప్పారు.
యూపీలో 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లను తొలగించారని బీజేపీనే చెబుతోందని, ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ స్థానంలో సుమారు 31 వేల ఓట్లను తీసివేశారని వివరించారు. తాము ఓడిపోతున్నామని తెలిసి, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు డ్రామాలు ఆడుతోందన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. ఇండియా కూటమి ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అమిత్ షా చేసిన ‘అంగదుడి పాదం’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు బీజేపీకే నిలబడేందుకు నేల లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అయోధ్య రాముడి సొమ్మును దొంగిలించిన వారికి సర్వనాశనం తప్పదని హెచ్చరించారు. గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీని అదే రాష్ట్ర ప్రజలు తిరిగి సాగనంపుతారన్నారు.
