న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం రామ్లీలా మైదాన్ వేదికగా జరిగిన 'ఇండియా' కూటమి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటాన్ని మహాభారత యుద్ధంతో పోల్చారు. ఇది దేశ ఓటర్లకు, మోసగాళ్లకు మధ్య జరుగుతున్న పోరు అని ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘం తీరును తీవ్ర పదజాలంతో విమర్శించారు.
శకుని మాదిరిగా ఎవరో తెరవెనుక పాచికలు మారుస్తున్నారని, ఆ శకుని ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. మోదీ కీలుబొమ్మలా మారిన సీఈసీ జ్ఞానేశ్కుమార్పై రాజద్రోహం కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని, అప్పుడే భవిష్యత్తులో ఎవరూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయరని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని 'దో నంబరీ సర్కార్' అని అభివర్ణించిన ఆయన, ప్రధాని మోదీని 'దస్ నంబరీ పీఎం' అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
