తెలంగాణ సర్కారు బడుల్లో లోపాలు సరిదిద్దాలి : విద్యాశాఖ

తెలంగాణ సర్కారు బడుల్లో లోపాలు సరిదిద్దాలి : విద్యాశాఖ
  •     సమగ్ర శిక్షా సోషల్ ఆడిట్‌‌‌‌‌‌‌‌పై విద్యాశాఖ సీరియస్
  •     4,620 స్కూళ్లలో తనిఖీలు పూర్తి చేసిన ‘సెస్’ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సోషల్​ఆడిట్ ద్వారా గుర్తించిన సమస్యలు, లోపాలను వెంటనే సరిదిద్దాలని విద్యాశాఖ డిసైడ్ అయింది. కేవలం తనిఖీలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి, ప్రజా విచారణలు నిర్వహించి డిసెంబర్ 5 నాటికి ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాకు 7 షీట్లతో కూడిన ఆడిట్ ఎక్సెల్ డేటాను పంపిస్తూ.. గడువుల్లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

ఒక్కో బడిలో 4 గంటల సర్వే

రాష్ట్రవ్యాప్తంగా 4,620 ప్రభుత్వ బడుల్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సంస్థ సోషల్ ఆడిట్ పూర్తి చేసింది. దీనికోసం ఒక్కో స్కూల్‌‌‌‌‌‌‌‌లో 200కు పైగా ప్రశ్నలతో 3-,4 గంటల పాటు సర్వే నిర్వహించింది. కేవలం రికార్డులు చూడటమే కాకుండా.. హెచ్​ఎం, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక యువత నుంచి వివరాలు సేకరించింది. విద్యార్థులకు అందాల్సిన ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, నోట్‌‌‌‌‌‌‌‌బుక్స్, స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, మౌలిక వసతులు, టీచర్ల కొరత, బోధన ప్రమాణాలు, టీచర్ల సమయపాలన, స్పోర్ట్స్, లైబ్రరీ నిధుల ఖర్చుతో పాటు బడుల్లో భద్రత వంటి అంశాలను పరిశీలించింది.

వేధింపులపై 48 గంటల్లోనే తేల్చాలె 

విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ అత్యంత సీరియస్‌‌‌‌‌‌‌‌గా స్పందించింది. ఆడిట్ డేటాలోని ‘షీట్–5’లో నమోదైన లైంగిక, మానసిక వేధింపులు, కొట్టడం, వివక్ష చూపడం వంటి తీవ్రమైన కేసులను డీఈవోలు స్వయంగా పరిశీలించాలని ఆదేశించింది.  ఫిర్యాదు అందిన 48 గంటల్లోపే విచారణ పూర్తి చేసి పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆడిట్ ఫలితాలను స్కూల్ నోటీసు బోర్డులపై ప్రదర్శించడంతో పాటు ఎస్‌‌‌‌‌‌‌‌ఎంసీ సమావేశంలో చదివి వినిపించాలని విద్యాశాఖ పేర్కొంది. సెస్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ.. ఈనెల25 నాటికి మండలాల వారీగా పబ్లిక్ హియరింగ్‌‌‌‌‌‌‌‌లు పూర్తి చేయాలని ఆదేశించింది. 

గడువుల వారీగా పనులు

స్కూల్ స్థాయిలో పరిష్కారమయ్యే హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్ల బోర్డులు, ఫిర్యాదుల పెట్టెలు, ప్రథమ చికిత్స కిట్లు, చిన్న మరమ్మతులను హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలు 15 రోజుల్లో పూర్తి చేయాలి. టీచర్ల సర్దుబాటు, డిప్యుటేషన్లు, దివ్యాంగ విద్యార్థుల స్టైపెండ్లు, రెసిడెన్షియల్ బడుల్లో వార్డెన్లు, వాచ్‌‌‌‌‌‌‌‌మెన్ల కొరతను డీఈవో, ఎంఈవోలు 21 రోజుల్లో పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఎస్​పీడీ పేర్కొన్నారు. అదనపు గదులు, ప్రహరీ వంటి పెద్ద పనులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. చివరగా, ప్రజా విచారణల వివరాలతో కూడిన పూర్తి ‘యాక్షన్ టేకెన్ రిపోర్టు’ను డీఈవోలు సంతకం చేసి డిసెంబర్ 5 నాటికి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని ఎస్​పీడీ స్పష్టం చేశారు.