మోదీ వెళ్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ..అప్పటి వరకు పోరాటం చేస్తం: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

మోదీ వెళ్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ..అప్పటి వరకు పోరాటం చేస్తం: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రధాని మోదీని గద్దె దించడమే ఏకైక మార్గమని కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కేంద్రంతోపాటు దేశంలోని పలు బీజేపీ ప్రభుత్వాలు ‘దొంగిలించిన’ ప్రజాతీర్పుతోనే ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. ఓటు చోరీ ఆరోపణలపై ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకు మల్లికార్జున్ ఖర్గేతోపాటు మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ ఎం.ఎ. బేబి, సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. అంతకుముందు మింటో రోడ్ - కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదాన్ వరకు ‘ఇండియా’ కూటమి నేతలంతా వాహనాల్లో భారీ ర్యాలీగా తరలివెళ్లారు. 

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెనకేసుకొస్తున్నారు..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనకేసుకొస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ‘‘దళితులు, యువకులు, మహిళల ఓట్లను వారు లాక్కునేందుకు ప్రయత్నించారు. మోదీజీ తన మనిషి ద్వారా వారి ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. మోదీ పదవి నుంచి దిగిపోయే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం’’ అని హెచ్చరించారు.

సీఈసీ ఎక్కడికి వెళ్లినా వదిలిపెట్టమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజల తీర్పును దొంగిలించి ఏర్పడినవేనని ఆరోపించారు. ఈ ఓట్ చోర్ ప్రభుత్వాలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘మోదీ జాయేగా తో హి లోక్సంత్రా బచేగా’’(మోదీ వెళ్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది) అని పేర్కొన్న ఆయన.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రధాని మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని కోరారు.