మోదీ, షా ద్వయంతో ప్రజాస్వామ్యం ఖూనీ..‘రామ్ లీలా’ ర్యాలీ... రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాంది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌  

మోదీ, షా ద్వయంతో ప్రజాస్వామ్యం ఖూనీ..‘రామ్ లీలా’ ర్యాలీ... రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాంది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌  

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా ల ద్వయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ ఫైర్ అయ్యారు.  ఓట్ చోరీ, పార్టీ చీలికలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో ఇండియా కూటమి చేపట్టిన ‘ఓట్‌‌‌‌‌‌‌‌ బచావో–దేశ్‌‌‌‌‌‌‌‌ బచావో’ ర్యాలీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నాంది అని  అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ర్యాలీకి హాజరైన కార్యకర్తలంతా రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ, ఇండియా కూటమి నేతల ప్రసంగాలను విని, వారి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  సూచించారు. ఆదివారం రామ్‌‌‌‌‌‌‌‌ లీలా మైదాన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా కూటమి నిర్వహించిన ‘ఛలో ఢిల్లీ.. ఓట్‌‌‌‌‌‌‌‌ బచావో–దేశ్‌‌‌‌‌‌‌‌ బచావో’ ర్యాలీకి తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ శ్రేణులను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ‘గ్యాదరింగ్ మీటింగ్’ లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేశ్​కుమార్​ గౌడ్ మాట్లాడుతూ, కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, లెక్క చేయకుండా కార్యకర్తలు ఢిల్లీ చేరుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అగ్రనేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు, నాయకులు రాంలీలా మైదానానికి  తరలిరావడంపై అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సహకారంతో, రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివచ్చారని వెల్లడించారు. 

ఓట్ చోరీలో మోదీ పాత్ర: మంత్రి సీతక్క

దేశవ్యాప్తంగా చోరీకి గురైన 13 కోట్ల ఓట్ల ప్రక్రియలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. అందుకే మోదీ ఒక దొంగను కాపాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘మేము అడిగేది మా ఒక్కరి హక్కు కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న ప్రజలందరి ఓటు హక్కు. అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును ఎవరూ కాలరాయడానికి లేదు’ అని  స్పష్టత ఇచ్చారు.  

 జ్ఞానేశ్ బర్తరఫ్ ఖాయం: ఆది శ్రీనివాస్

అడ్రస్‌‌‌‌‌‌‌‌ మారితే ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఓట్లను ఎలా తొలగిస్తారంటూ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ బీజేపీ ప్రభుత్వం జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ను వెనకేసుకొస్తోందని  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాంలీలా మైదాన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభ దెబ్బకు కేంద్రం దిగివచ్చి జ్ఞానేష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను బర్తరఫ్‌‌‌‌‌‌‌‌ చేయడం ఖాయమని చెప్పారు.  పేదల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, ఆ కుట్రలను అడ్డుకోవాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ ఎత్తివేసిన తర్వాత రామ్ లీలా మైదాన్ వేదికగా సాగుతోన్న ఈ భారీ ర్యాలీతోనే బీజేపీ పతనం మొదలైందని రంగారెడ్డి డీసీసీ పారిజాత అన్నారు.  బీజేపీ నేతల ఓట్ చోరీ పై రాహుల్ చేస్తోన్న న్యాయపోరాటానికి ఆ రాముడి ఆశీస్సులు ఉంటాయన్నారు. 

తెలంగాణ పేరు చెబితేనే భయం : మంత్రి వాకిటి

దేశవ్యాప్తంగా ఓట్ చోరీ చేసి కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. ఆ పార్టీకి తెలంగాణ పేరు చెబితేనే భయం పట్టుకుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ నేతృత్వంలో సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజలంతా ఏకం కావాలి: డిప్యూటీ సీఎం భట్టి

కేంద్రంలోని మోదీ సర్కార్ అభిప్రాయాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. చివరకు  ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన తన స్వతంత్రతను ఈసీ కోల్పోతుందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా తన స్వతంత్ర నిర్ణయాలతో పనిచేయాలని స్పష్టం చేశారు.  సర్ పేరుతో దేశంలోని అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 వేల నుంచి 25 వేల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.  ఈ ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. . రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాలో అక్రమాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.