భార్య కళ్లలో ఆనందం చూడటం కోసం పాతిక లక్షల కారును కొట్టేసిన కారు షోరూం ఉద్యోగి !

భార్య కళ్లలో ఆనందం చూడటం కోసం పాతిక లక్షల కారును కొట్టేసిన కారు షోరూం ఉద్యోగి !

మధ్యప్రదేశ్లోని భోపాల్లో భార్యపై ప్రేమతో ఒక భర్త చేసిన పని అతని కొంప ముంచింది. ఖరీదైన కార్లలో తిరగాలనే తన భార్య కోరికను తీర్చడం కోసం భర్త పెద్ద రిస్కే చేశాడు. స్వతహాగా కార్ల షోరూంలో ఉద్యోగి కావడంతో భార్య కళ్లలో ఆనందం చూడటం కోసం తను పని చేసే కార్ల షోరూం నుంచే రూ.23 లక్షల కారు కొట్టేశాడు. సదరు దొంగ భర్త పేరు గజేంద్ర అలియాస్ రిషి ఆనంద్‌. సెప్టెంబర్ 28 రాత్రి షోరూమ్ నుంచి ఒక కస్టమర్ పేరు మీద బుక్ చేసిన వోక్స్‌వ్యాగన్ విర్టస్ జీటీ కారును తీసుకుని వెళ్ళిపోయాడు.

కంపెనీ స్టాక్ తనిఖీ చేసిన సమయంలో కారు కనిపించకపోవడంతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం స్పష్టంగా కనిపించనప్పటికీ, వాహనంలోని జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సహాయంతో శుక్రవారం రాత్రి నర్మదాపురం రోడ్డులోని అషిమా మాల్ సమీపంలో పోలీసులు ఈ కారును గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, నిందితుడి భార్య దొంగిలించిన కారును నడుపుతూ కనిపించింది. అయితే, ఆమె పోలీసులను చూడగానే కారును వదిలేసి పారిపోయింది.

►ALSO READ | వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలు వచ్చాయ్.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో కలకలం.. మేనేజర్‌కు చుక్కలు!

గజేంద్ర అలియాస్ రిషి ఆనంద్ స్వస్థలం హోషంగాబాద్. భోపాల్‌లోని అశోకా గార్డెన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతను సుమారు ఏడాదిగా జేకే రోడ్‌లోని వోక్స్‌వ్యాగన్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. కారులో అమర్చిన జీపీఎస్ సిస్టంతో దర్యాప్తు సులువైంది. అధికారులకు కారు ఆచూకీ కనుక్కోవడంలో జీపీఎస్ సహాయపడింది. విలాసవంతమైన వాహనాల్లో ప్రయాణించాలన్న తన భార్య కోరికను తీర్చడం కోసమే నిందితుడు ఖరీదైన కారును దొంగిలించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.