హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం (నవంబర్ 2) మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద అమిత్ షాకు శాలువా కప్పి పూలబోకే అందించారు. అనంతరం అమిత్ షా రోడ్డు మార్గంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 2:10 నుంచి 3:45 గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు.
అనంతరం 3:55 గంటలకు నిజాం కాలేజ్ ఎదుట ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5:05 గంటలకు మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాకు చేరుకోనుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి యాత్రను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. సభ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు. అమిత్ షా పాదయాత్రకు తెలంగాణ బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. మరోవైపు.. అమిత్ షా పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భద్రతను కట్టదిట్టం చేశారు.
