సినీ నిర్మాతలకు CBFC బిగ్ షాక్.. ఇకపై లాస్ట్ మినిట్ సెన్సార్‌కు నో.. కొత్త రూల్స్ ఇవే!

సినీ నిర్మాతలకు CBFC బిగ్ షాక్.. ఇకపై లాస్ట్ మినిట్ సెన్సార్‌కు నో.. కొత్త రూల్స్ ఇవే!

సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలయ్యాక సెన్సార్ సర్టిఫికెట్ కోసం హడావుడి చేసే నిర్మాతలు, దర్శకులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై చివరి నిమిషంలో వచ్చే సెన్సార్ అభ్యర్థనలను ప్రోత్సహించబోమని స్పష్టం చేసింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడిందనే కారణంతో ప్రత్యేకంగా సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం కుదరదని కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు CBFC సీఈఓ రాజేంద్ర సింగ్ కీలక మార్గదర్శకాలను వెల్లడించారు.

ఈకొత్త నిబంధనల ప్రకారం నిర్మాతలు సెన్సార్ కోసం సినిమాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి సమర్పించాలి. రఫ్ కట్స్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వెర్షన్లను ఇకపై బోర్డు స్వీకరించదు. సినిమా ఫైనల్ ఎడిటింగ్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పూర్తయి ఉండాలి. అంతేకాదు సబ్‌టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ వంటి అంశాలు కూడా సిద్ధంగా ఉండటం తప్పనిసరి. తాత్కాలిక సంగీతం, అసంపూర్తి సాంకేతిక పనులతో సినిమాను పంపిస్తే తిరస్కరణ తప్పదని బోర్డు స్పష్టం చేసింది.

అంతే కాదు ఇకపై సినిమా విడుదల తేదీని ముందుగానే ప్రకటించినా, భారీగా ప్రమోషన్లు నిర్వహించినా సెన్సార్ విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత లభించదు. ప్రీమియర్ షోలు, ప్రచార కార్యక్రమాలు కూడా త్వరితగతిన సర్టిఫికెట్ పొందడానికి కారణాలు కావని తేల్చిచెప్పింది. చివరకు సినిమా టైటిల్ కూడా బోర్డు ఆమోదం పొందే వరకు ఖరారైనట్లుగా పరిగణించరు.

►ALSO READ | AK47 Box Office: మూడు రోజుల్లోనే ‘ఆదర్శ కుటుంబం’ భారీ వసూళ్లు.. కలెక్షన్ల పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్!

ఈ నిర్ణయం భారీ బడ్జెట్ చిత్రాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చివరి వారాల్లోనూ గ్రాఫిక్స్, కలర్ గ్రేడింగ్ పనులు పూర్తి చేసే పాన్ ఇండియా సినిమాల నిర్మాతలు ఇకపై ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ తో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించామంటే సరిపోదు.. సెన్సార్‌కు కూడా సినిమా సిద్ధంగా ఉండాల్సిందేనని CBFC స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలతో సినీ పరిశ్రమలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.