SRK Life Lessons: జీవితంలో గెలవాలంటే షారుఖ్ చెప్పిన 5 సక్సెస్ సీక్రెట్స్ ఇవే

SRK Life Lessons: జీవితంలో గెలవాలంటే షారుఖ్ చెప్పిన 5 సక్సెస్ సీక్రెట్స్ ఇవే

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. ఈ పేరు వింటేనే అభిమానుల్లో ఓ రేంజ్ క్రేజ్ కనిపిస్తుంది. వెండితెరపై తనదైన స్టైల్, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ కింగ్ ఖాన్.. సినిమాలకే పరిమితం కాకుండా తన మాటలతోనూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నారు. నవంబర్ 2న 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గతంలో వివిధ వేదికలపై చెప్పిన జీవిత పాఠాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓటమిని ఎలా స్వీకరించాలి? ఇతరుల పట్ల ఎలా ఉండాలి? కష్టకాలంలో మనల్ని మనం ఎలా నమ్ముకోవాలి? అనే విషయాలపై షారుఖ్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కష్టకాలంలోనూ మనల్ని మనం నమ్ముకోవాలి..

2012లో యేల్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన షారుఖ్ ఖాన్.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మన అసలు వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దని సూచించారు. ప్రపంచం మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మనపై కఠినంగా వ్యవహరించవచ్చు. అలాంటి సమయంలో ఇతరులు మనల్ని గుర్తించకపోయినా.. మనల్ని మనం గుర్తించాలని చెప్పారు. మనలోని అసలైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే కష్టాలను అధిగమించే మార్గమని ఆయన మాటల సారాంశం.

కన్ఫ్యూజన్ ఉంటేనే క్లారిటీ వస్తుంది..

2015లో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా షారుఖ్ చేసిన ప్రసంగం కూడా అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. జీవితంలో గందరగోళం, అయోమయం ఎదురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కన్ఫ్యూజన్ నుంచే కొత్త ఆలోచనలు, స్పష్టత పుడతాయని వివరించారు. మన అభిప్రాయాలే సరైనవని మొండిగా నమ్మకుండా.. ఎదుటివారి ఆలోచనలను కూడా గౌరవించాలని సూచించారు. మన విలువలు మనల్ని ఇతరుల కంటే గొప్పవారిగా చేయవని, కేవలం భిన్నంగా నిలబెడతాయని చెప్పడం విశేషం.

దయ చూపడం ఎదుటివారికి చేసే ఉపకారం కాదు..

ఇతరుల పట్ల దయగా ఉండటం గురించి షారుఖ్ చెప్పిన మాటలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఎదుటివారికి ఏదో గొప్ప ఉపకారం చేస్తున్నామని భావించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరులకు సాయం చేయడం వల్ల మనకే ఒక ప్రత్యేకమైన సంతృప్తి లభిస్తుందని చెప్పారు. దయ, సేవ, మంచి పనుల ద్వారా ఎక్కువ ఆనందాన్ని పొందేది మనమేనని ఆయన వివరించారు. స్టార్‌డమ్, డబ్బు కంటే మనుషుల పట్ల చూపించే ప్రేమ, మంచితనమే గొప్పవని ఆయన మాటలు గుర్తుచేస్తున్నాయి.

ఓటమికి భయపడితే విజయం సాధించలేం..

విజయం, అపజయం గురించి షారుఖ్ చెప్పిన మాటలు ఎంతోమందికి మోటివేషన్‌గా నిలుస్తున్నాయి. విజయం వచ్చినప్పుడు ఆనందిస్తాం.. కానీ నిజమైన జీవిత పాఠాలు ఎక్కువగా ఓటముల నుంచే నేర్చుకుంటామని ఆయన అభిప్రాయపడ్డారు. అపజయం ఎదురుకాకపోవడమే విజయానికి కొలమానం కాదని, ఓటమి ఎదురైనప్పుడు మనం ఎలా స్పందిస్తామన్నదే అసలైన విషయమని చెప్పారు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించడమే మానేస్తే విజయం సాధించడం కష్టమని ఆయన సందేశం ఇచ్చారు.

ఎంత ఎదిగినా మనుషుల విలువ మర్చిపోవద్దు..

ఎంత డబ్బు, పేరు, ప్రఖ్యాతి సంపాదించినా మనుషుల మధ్య ఉండే అనుబంధాలను తక్కువగా అంచనా వేయకూడదని షారుఖ్ సూచించారు. స్నేహితుడికి ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చినా.. అతడు బాధలో ఉన్నప్పుడు ఓపికగా అతడి మాటలు వినడం ఇచ్చే ఆనందానికి అది ప్రత్యామ్నాయం కాలేదని ఆయన చెప్పిన మాటలు హృదయాన్ని తాకుతున్నాయి. నిజమైన విజయం అంటే ఎంత ఎత్తుకు ఎదిగామన్నది మాత్రమే కాదు.. ఎదిగిన తర్వాత ఎంత ఒదిగి ఉన్నామన్నది కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయం.

పుట్టినరోజున అభిమానులకు స్పెషల్ ట్రీట్..

మరోవైపు, షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం మన్నత్ దగ్గర అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు షారుఖ్ చేతిరాతతో ప్రత్యేక సందేశం పంపించారు. వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ.. అదే ప్రేమను తిరిగి పంపిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, తన తదుపరి చిత్రం ‘కింగ్’ నుంచి ప్రత్యేక విజువల్స్, డైలాగ్స్‌తో అభిమానుల్లో మరింత హైప్ పెంచారు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో షారుఖ్‌తో పాటు సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. పుట్టినరోజు వేళ ‘కింగ్’ సినిమాపై అంచనాలు పెంచుతూనే.. తన జీవిత అనుభవాలతో మరోసారి అభిమానులకు స్ఫూర్తినిచ్చారు షారుఖ్ ఖాన్.