ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న 'రామాయణ'. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇంతటి భారీ ప్రాజెక్టుకు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో చిన్న షాక్ తగిలినట్లు కనిపిస్తోంది.
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా తొలి భాగానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ టాపిక్ గా మారింది. నవంబర్ 2 సోమవారం ఉదయం 11 గంటల నాటికి ఇండియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.25.77 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు సాక్నిల్క్ ( Sacnilk ) వెల్లడించింది. మొత్తం 14,970 షోలలో 5.97 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే బ్లాక్ చేసిన సీట్లను మినహాయిస్తే ఈ మొత్తం రూ.21.69 కోట్లకు చేరుతుంది. ఇప్పటివరకు 41 షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.
ఇక మొదటి నాలుగు రోజుల షోల అడ్వాన్స్ బుకింగ్స్‌ను పరిశీలిస్తే ఇండియాలో రూ.47.62 కోట్ల గ్రాస్ నమోదైంది. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది. విదేశాల్లో అన్ని అందుబాటులో ఉన్న షోల ప్రీ-సేల్స్ ద్వారా సుమారు 3.5 మిలియన్ డాలర్లు అంటే రూ.33.20 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ విలువ రూ.80.8 కోట్లకు చేరింది.
రాష్ట్రాల వారీగా చూస్తే యశ్‌కు మంచి మార్కెట్ ఉన్న కర్ణాటక నుంచి తొలి రోజు రూ.4.84 కోట్లు వచ్చాయి. మహారాష్ట్ర నుంచి రూ.4.82 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.3.68 కోట్లు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో యశ్ నటిస్తున్న మరో భారీ చిత్రం 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్‌తో పోలిస్తే రామాయణ వెనుకబడటం చర్చనీయాంశంగా మారింది. టాక్సిక్ తొలి రోజు ప్రీ-సేల్స్‌లోనే రూ.73.43 కోట్ల గ్రాస్ నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.
►ALSO READ | Chiranjeevi: అమిత్ షాతో చిరంజీవి, రామ్‌చరణ్ భేటీ.. ఆత్మీయ సమావేశమా? రాజకీయ వ్యూహమా?
ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నప్పుడు, రామాయణకు కనీసం వందల కోట్ల స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండాలని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే విడుదలకు ఇంకా సమయం ఉండటంతో చివరి నిమిషంలో బుకింగ్స్ ఊపందుకునే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా, రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. మరి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ పుంజుకుంటాయా? తొలి రోజు వసూళ్లతో రామాయణ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా? లేక భారీ బడ్జెట్‌కు తగ్గ వసూళ్లు సాధించేందుకు కష్టపడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
