ఎవరు లేకున్నా షాపు ఓపెన్‌గానే ఉంటుంది.. నచ్చినవి తీసుకోని డబ్బులు కట్టొచ్చు ! ఇదే ఈ ఊరు స్పెషాలిటీ!

ఎవరు లేకున్నా షాపు ఓపెన్‌గానే ఉంటుంది.. నచ్చినవి తీసుకోని డబ్బులు కట్టొచ్చు ! ఇదే  ఈ ఊరు స్పెషాలిటీ!

సాధారణంగా మనం ఏదైనా షాపుకి  వెళ్తే అక్కడ షాపు ఓనరు ఉంటారు. మనకు కావాల్సిన వస్తువులు ఇచ్చి, వాటికి డబ్బులు తీసుకుంటారు. ఇక షాపుల్లో  దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఒకవేళ షాపులో ఎవరూ లేకపోతే? కనీసం సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోతే? అప్పుడు వస్తువులు తీసుకున్నవారు డబ్బులు చెల్లిస్తారా? అనే సందేహం రావడం సహజం.

అయితే నాగాలాండ్‌లో మాత్రం ఇలాంటి సందేహాలకు తావులేకుండా కొన్ని షాపులు నడుస్తున్నాయి. అక్కడ దుకాణదారుడు లేదా షాపు ఓనర్ ఉండడు.. కస్టమర్లను గమనించే వ్యక్తి ఉండడు.. సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించవు. అయినప్పటికీ ప్రజలు వారికీ కావాల్సిన వస్తువులను తీసుకుని, వాటికి డబ్బులను  చెల్లించి వెళ్తారు. కేవలం నమ్మకం, నిజాయితీ ఆధారంగా నడుస్తున్న ఈ షాపుల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నాగాలాండ్‌లోని ఈ ప్రత్యేకమైన షాపుల గురించి ఆ రాష్ట్ర పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. దీంతో ఈ షాపుల గురించి మరోసారి చర్చ మొదలైంది.

షాపు ఓనర్ లేకుండానే షాపింగ్..  
నాగాలాండ్‌లోని కొన్ని గ్రామాల్లో రోడ్డు పక్కనే చిన్న చిన్న షాపులు  కనిపిస్తాయి. అయితే మిగతా షాపులలాగా వీటిలో ఎవరూ ఉండరు. ఈ షాపుల్లో పండ్లు, కూరగాయలు, ఇతర స్థానిక ఉత్పత్తులను ఉంచుతారు. ప్రతి వస్తువు పక్కన దాని ధరను కూడా రాసి పెడతారు. వినియోగదారులు వారికీ నచ్చిన వస్తువులను తీసుకుని, వాటికి డబ్బులను అక్కడే ఏర్పాటు చేసిన డబ్బుల పెట్టెలో వేయాలి.

అంతేకాదు.. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొన్ని దుకాణాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని స్కాన్ చేసి కూడా డబ్బులు చెల్లించవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వినియోగదారులు ఎంత డబ్బు చెల్లిస్తున్నారు? ఎంతమంది వస్తువులు తీసుకెళ్తున్నారు? అని గమనించేందుకు ఎవరూ ఉండరు. అయినప్పటికీ ప్రజలు వారికీ కావాల్సిన వస్తువులు తీసుకున్న తర్వాత  డబ్బులు చెల్లించి వెళ్తుంటారు.

రైతులు పనులు చేసుకుంటూనే వ్యాపారం!
ఈ దుకాణాల వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉంది. వీటిలో ఎక్కువగా స్థానిక రైతులు వారి పొలాల్లో పండించిన పండ్లు, కూరగాయలను విక్రయిస్తుంటారు. రైతులు రోజంతా దుకాణం దగ్గర కూర్చుని ఉండాల్సిన అవసరం లేదు. వారి వ్యవసాయ పనులు చేసుకుంటూనే పంటలను దుకాణాల వద్ద అమ్మకానికి ఉంచుతారు. ప్రజలు వచ్చి కావాల్సిన వస్తువులు తీసుకుని, వాటి ధరకు  డబ్బులు చెల్లిస్తారు.

దీంతో రైతులకు సమయం ఆదా అవుతుంది. ప్రత్యేకంగా దుకాణంలో కూర్చునేందుకు ఒక వ్యక్తి అవసరం కూడా ఉండదు. అదే సమయంలో వినియోగదారులు వారికీ కావాల్సిన వస్తువులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయవచ్చు.

ఫుట్సెరోలో సుమారు 20  దుకాణాలు!
ఒక నివేదిక ప్రకారం.. నాగాలాండ్‌లోని ఫుట్సెరో ప్రాంతంలో మహిళా రైతులు ఇలాంటి సుమారు 20 దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల్లో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా స్థానికంగా తయారుచేసిన మరికొన్ని ఆహార పదార్థాలు కూడా  ఉంటాయి.

నమ్మకమే ఈ దుకాణాలకు పెట్టుబడి!
సాధారణంగా ఏదైనా వ్యాపారం నిర్వహించాలంటే పెట్టుబడి, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు అవసరం. ముఖ్యంగా దుకాణాల్లో దొంగతనాలు జరగకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ నాగాలాండ్‌లోని ఈ దుకాణాలు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఉంటాయి.

ఇక్కడ వ్యాపారానికి ప్రధాన పెట్టుబడి ప్రజల నిజాయితీ, నమ్మకం మాత్రమే. ఎవరూ గమనించకపోయినా  బాధ్యతను గుర్తించి డబ్బులు చెల్లిస్తారనే విశ్వాసంతో రైతులు  వస్తువులను అక్కడే వదిలి వెళ్తున్నారు.ఈ విధానం వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతోంది. రైతులు వ్యవసాయ పనులు చూసుకోవచ్చు. 

మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ ఏమన్నారంటే?
నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ ఈ దుకాణాల గురించి సోషల్ మీడియా Xలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. "దుకాణదారుడు లేడు.. సీసీటీవీ లేదు.. కేవలం నమ్మకం మాత్రమే ఉంది. మీరు నివసించే ప్రాంతంలో కూడా ఇలాంటి విధానం పనిచేస్తుందా?" అంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నాగాలాండ్‌లోని దుకాణాల ప్రత్యేకతను వివరిస్తూ ఒక ఫొటోను కూడా షేర్ చేసారు. ఈ దుకాణాల్లో ఎవరూ లేకపోయినా ప్రజలు వారికీ కావాల్సిన వస్తువులను తీసుకుని,  డబ్బులు స్వయంగా చెల్లిస్తారని పేర్కొన్నారు. వ్యాపారం అంటే కేవలం వస్తువులు అమ్మడం, డబ్బులు సంపాదించడం మాత్రమే కాదని.. మనుషుల మధ్య ఉండే నమ్మకం, నిజాయితీ కూడా ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యాపారం నడవడానికి నమ్మకం కూడా ముఖ్యమే!
కొన్నిసార్లు ఒక వ్యాపారం విజయవంతంగా కొనసాగడానికి పెద్ద పెట్టుబడులు, భారీ భద్రతా ఏర్పాట్లు అవసరం లేదని నాగాలాండ్‌లోని ఈ దుకాణాలు నిరూపిస్తున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే సాధారణమైన పద్ధతుల్లో కూడా వ్యాపారాన్ని కొనసాగించవచ్చని ఈ విధానం తెలియజేస్తోంది.

ముఖ్యంగా ఎవరూ చూడటం లేదనే కారణంతో తప్పు చేయకుండా, తాము తీసుకున్న వస్తువులకు డబ్బు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయాన్ని ఈ దుకాణాలు గుర్తుచేస్తున్నాయి.

మొత్తంగా చూస్తే.. దుకాణదారుడు లేకుండా, సీసీటీవీ కెమెరాలు లేకుండా కేవలం ప్రజల నిజాయితీతో నడుస్తున్న నాగాలాండ్‌లోని ఈ దుకాణాలు నిజంగా ప్రత్యేకమే. సాంకేతికత, నిఘా కంటే మనుషుల మధ్య నమ్మకానికి ఎంత విలువ ఉంటుందో చెప్పడానికి ఇవి మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి.