పొద్దున ఏడు గంటలకు లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఉద్యోగం, ట్రాఫిక్.. ఇంటికెళ్లిన తర్వాత కూడా ఆఫీసులో ఏం జరుగుతుందనే టెన్షన్.. ఆఫీసులో రేపటి టార్గెట్ పై రాత్రంతా పరేషాన్.. 30 రోజులు కష్టపడితే వచ్చే జీతం.. అలా పడితే ఇలా అయిపోతుంది.. మళ్లీ నెలంతా అప్పులు, చేబదుల్లే.. ఇంతా కష్టపడినా సుఖం లేదు.. సుఖమైన నిద్ర లేదూ.. సిటీలో సగటు ఉద్యోగస్తుడి బాధులు ఇవి.. ఇలాంటప్పుడే కొన్ని వార్తలు అద్భుతంగా అనిపిస్తుంటాయి.. అలాంటి వాటిలో ఇది ఒకటి.. మ్యాగీ అమ్ముకుంటూ రోజుకు 15 వేల రూపాయలు సంపాదిస్తున్నాడంట.. ఈ వార్త చదివిన తర్వాతనే.. పైన చెప్పిన ఉద్యోగస్తుడి ఆవేదన, దుఖం తన్నుకు వస్తుంది. ఇంతకీ రోజుకు 15 వేల రూపాయలు సంపాదిస్తున్న ఆ మ్యాగీ సెల్లర్ పూర్తి వివరాలు తెలుసుకుందామా....
హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తాంగ్ పాస్‌లో రోడ్డు పక్కన మ్యాగీ స్టాల్ నడుపుతున్న ఒక వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. టూరిజం సీజన్ కాకపోయినా (ఆఫ్-సీజన్) కూడా అతను రోజుకు సుమారు 14 వేల నుంచి 15 వేల రూపాయల వరకు టర్నోవర్ సాధిస్తుండటం వైరల్ అవుతోంది.
కంటెంట్ క్రియేటర్ హర్ష్ చౌహన్ రోహ్‌తాంగ్ పాస్‌కు వెళ్లినప్పుడు ఈ మ్యాగీ వ్యాపారితో మాట్లాడి వీడియో తీశారు. ఆఫ్-సీజన్‌లో ఎంత సంపాదిస్తున్నారు? అని అడగగా, ఆ వ్యాపారి ఇలా చెప్పాడు.
రోజుకు 60 నుంచి 70 ప్లేట్ల మ్యాగీ అమ్ముతానని చెప్పాడు. ఒక్కో ప్లేట్ 100 రూపాయలు. అలాగే సుమారు 200 కప్పుల టీ అమ్ముతాడట. ఒక్క చాయ్ 40 రూపాయలు. ఈ లెక్క ప్రకారం రోజువారీ సేల్స్ 14 వేల నుంచి 15 వేల వరకు ఉంటోంది. ఉడకబెట్టిన గుడ్డు ఆర్డర్లు కూడా కొన్ని వస్తున్నాయని చెప్పారు.
►ALSO READ | సిటీ లైఫ్కు బైబై.. బెంగళూర్ నుంచి గోవాకు మకాం మార్చిన జంట.. ఖర్చుల లెక్కలపై చర్చ!
హర్ష్ చౌహన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇది కేవలం ఆఫ్-సీజన్ మాత్రమే... పీక్ సీజన్‌లో ఎంత టర్నోవర్ ఉంటుందో ఊహించండి! అంటూ పోస్ట్ చేశారు. చిన్న వ్యాపారం అనేది ఏమీ లేదు చెబుతూ షేర్ చేసిన వీడియోపై ఎందరో కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్ట్రెస్ జాబ్స్ వదిలి మ్యాగీ అమ్ముకున్నా హాయిగా బతికేయొచ్చు కదా అంటూ రిప్లై ఇస్తున్నారు.
అయితే కొందరు ఇది కేవలం గ్రాస్ సేల్స్ మాత్రమేనని, నిజమైన లాభం లెక్కించాలంటే ఖర్చులు తీసివేయాలని అంటున్నారు. ఎత్తైన ప్రాంతానికి సరుకులు తీసుకురావడం, కఠినమైన వాతావరణం, శారీరక శ్రమ వంటి కారణాలతో ఖర్చులు ఎక్కువగా ఉంటాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చిన్న వ్యాపారుల సామర్థ్యం ఏంటో చెబుతోందని కామెంట్స్ చేస్తున్నారు.
