హైదరాబాద్: బియ్యం కొరత సృష్టించి, కృత్రిమంగా ధరలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపించింది. అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), తూనికలు-కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) అధికారులు సంయుక్తంగా అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఈ తనిఖీలు చేపట్టారు. రిటైల్, హోల్‌సేల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను గుర్తించారు.
25 కిలోల బస్తాపై 26 కిలోల లేబుల్!
ఈ తనిఖీల్లో వ్యాపారులు చేస్తున్న తూనికల మోసాలు బయటపడ్డాయి. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా లేబుల్స్ వేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కంపెనీలు ముద్రించిన అసలు గరిష్ఠ చిల్లర ధర (MRP)పై అధిక ధరలతో కొత్త స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.మరికొందరు వ్యాపారులు ట్రేడ్, జీఎస్టీ, లేబర్, ఎఫ్ఎస్ఎస్ఏఐ వంటి తప్పనిసరి లైసెన్సులు లేకుండానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ఇతర అవసరాలకు మళ్లించడం వంటి అక్రమాలను కూడా అధికారులు గుర్తించారు.
11 ఎఫ్ఐఆర్లు నమోదు
అక్రమాలకు పాల్పడిన వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సరూర్‌నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 11 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అక్రమ వ్యాపారాలపై నిరంతర నిఘా
ప్రజలకు నిత్యావసర సరుకులు సరైన ధరలకు, పారదర్శకంగా అందించడమే పౌరసరఫరాల శాఖ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. బియ్యం కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, తూకాల్లో మోసాలకు పాల్పడటం వంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.ఇకపై కూడా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
