హైదరాబాద్: ఖైదీల మానసిక ఆరోగ్య పరిరక్షణ, వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ జైళ్ల శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖైదీల్లో ఆనందం, ఉత్సాహం, మానసిక ప్రశాంతత పెంచేందుకు ‘ULLASAM’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంచల్‌గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో ఈ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు.
మానసిక ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలను తగ్గించడంతో పాటు స్వీయహాని, ఆత్మహత్యా ప్రవృత్తులను నియంత్రించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఖైదీలకు కేవలం శారీరక వ్యాయామాలే కాకుండా వినోదం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పురుష, మహిళా ఖైదీలకు ప్రత్యేక ఆటలు
ఈ కార్యక్రమంలో భాగంగా పురుష ఖైదీలకు వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, త్రో బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా ఏర్పాటు చేశారు.మహిళా ఖైదీల కోసం మ్యూజికల్ చైర్స్, నిమ్మకాయ స్పూన్ రేస్, బెలూన్ గేమ్స్‌తో పాటు బ్యాడ్మింటన్, చెస్, డాడ్జ్‌బాల్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. ఖైదీల వయస్సు, శారీరక సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని ఆటలను ఎంపిక చేశారు. పురుష, మహిళా ఖైదీలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జట్టు స్ఫూర్తి, సమన్వయం పెంపొందించేలా..
క్రీడలు, వినోద కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో జట్టు స్ఫూర్తి, పరస్పర సమన్వయం, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెంపొందించడమే లక్ష్యంగా ULLASAM కార్యక్రమాన్ని రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రెస్టిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
►ALSO READ | దత్తత వివాదం: అమ్మా నాన్న.. నన్ను తీసుకెళ్లండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిన్నారి వీడియో !
అన్ని జైళ్లకు విస్తరణ
ప్రస్తుతం చంచల్‌గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని త్వరలో చర్లపల్లి కేంద్ర కారాగారానికి విస్తరించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలోనూ అమలు చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఖైదీల సంక్షేమం, మానసిక ఆరోగ్యం, పునరావాసాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ULLASAM కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఐజీలు వై. రాజేష్, ఎన్. మురళీ బాబు తదితరులు పాల్గొన్నారు.
