ఒంగోలు దగ్గర తీరం దాటనున్న తుఫాన్ మురసు : బీభత్సం తప్పదని వార్నింగ్స్

ఒంగోలు దగ్గర తీరం దాటనున్న తుఫాన్ మురసు : బీభత్సం తప్పదని వార్నింగ్స్

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను ప్రస్తుతం నెల్లూరుకు 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు, తిరుపతికి 160 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుపాను ఇవాళ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.

రంగంలోకి 90 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది

మురసు తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అరక్కోణం సమీపంలోని నాలుగో బెటాలియన్ నుంచి 90 మంది సిబ్బందితో కూడిన మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు.ఒక్కో బృందంలో 30 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. ఈ బృందాలు నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలకు చేరుకుని సహాయక, పునరావాస చర్యల్లో పాల్గొననున్నాయి.

►ALSO READ | భీకర తుఫాన్ గా మురసు : ఒంగోలు దగ్గర తీరం దాటే ప్రళయమేనా..!

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.