దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన క్యూ2 ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో సెప్టెంబరుతో ముగిసిన 3 నెలల త్రైమాసిక కాలంలో రూ.23వేల 038కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో సంపాదించిన రూ.20వేల 160 కోట్ల లాభం కంటే 14.3 శాతం ఎక్కువే. కేవలం 90 రోజుల్లోనే బ్యాంక్ ఈ స్థాయిలో లాభాలు అంటే ఏడాదికి దాదాపు రూ.లక్ష కోట్ల మేర లాభాలు ఆర్జిస్తోంది. లాభాల విషయంలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజ సంస్థలకు సైతం గట్టిపోటీని అందిస్తోంది.
క్వార్టర్లీ ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ తన బలమైన వ్యాపార వృద్ధిని చాటుకోవడంతో పాటు ఆస్తి నాణ్యతలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.7 శాతం వృద్ధితో రూ. 49వేల142 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 42వేల 847 కోట్లుగా మాత్రమే నమోదైంది.
ALSO READ : ఇక గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ సెంటర్ల ఏర్పాటు..
ఇక బ్యాంక్ అసెట్స్ క్వాలిటీ విషయానికి వస్తే.. స్టేట్ బ్యాంక్ తన మొండి బకాయిలను సమర్థవంతంగా నియంత్రించడంలో మరోసారి విజయవంతమైంది. సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తుల (GNPA) నిష్పత్తి మెరుగై 1.39 శాతానికి పడిపోయింది. అలాగే నికర నిరర్థక ఆస్తుల(NNPA) కేవలం 0.36 శాతంగా నమోదైంది. ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కంపెనీ బలమైన పనితీరును ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
