ఫాస్టాగ్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ.. తప్పుడు కారణాలతో టోల్ ప్లాజాల వద్ద జరిమానాలు విధిస్తే ఇకపై వినియోగదారులు సహించాల్సిన పనిలేదు. తాజాగా చండీగఢ్‌లోని ఓ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పు ఫాస్టాగ్ యూజర్లకు ఎంతో ఊరటనిస్తోంది. ఖాతాలో పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్నా రూ.100 పెనాల్టీ వసూలు చేసిన NHAI, సంబంధిత ఆన్‌లైన్ పేమెంట్స్ బ్యాంకుకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. తప్పుగా వసూలు చేసిన జరిమానాతో పాటు అదనంగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే.. బాధితుడు 2022 జూన్ 17న చండీగఢ్ నుంచి జలంధర్ వెళ్తుండగా బెహ్రామ్ టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజుతో పాటు రూ.100 పెనాల్టీ కట్ అయ్యింది. వాస్తవానికి ఆ సమయంలో ఆయన ఫాస్టాగ్ వాలెట్‌లో రూ.210 డబ్బులు ఉన్నాయి. అయినప్పటికీ ఫాస్టాగ్ సిస్టమ్ వాలెట్‌లో నిధులు లేవంటూ తప్పుగా జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ బ్యాలెన్స్ నెగెటివ్‌గా లేనప్పుడు వాహనాలను వెళ్లకుండా ఆపకూడదని, పెనాల్టీ విధించకూడదని NHAI సర్క్యులర్ స్పష్టం చేస్తోంది.
దీనిపై బాధితుడు చండీగఢ్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఆన్‌లైన్ పేమెంట్స్ బ్యాంక్ వాదిస్తూ.. తమ అకౌంట్‌లో రూ.150 మినిమం బ్యాలెన్స్ ఉండాలని.. దానిని టోల్ చెల్లింపులకు వాడలేమని తెలిపింది. అయితే ఈ వాదనను కమిషన్ పూర్తిగా తోసిపుచ్చింది. సర్వీస్ ప్రొవైడర్‌గా ఉంటూ నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం సేవల్లో లోపమే అవుతుందని స్పష్టం చేసింది.
చార్జ్‌బ్యాక్ గడువు ముగిసిందన్న బ్యాంక్ వాదనను కూడా కమిషన్ తోసిపుచ్చింది. సేవల్లో లోపం ఉన్నప్పుడు గడువు ముగిసిందనే సాకుతో బాధ్యత నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది. NHAI కూడా విచారణకు హాజరుకాకపోవడంతో ఏకపక్షంగా తీర్పు వెలువరించింది. తప్పుగా వసూలు చేసిన రూ.100 జరిమానాతో పాటు, వేదనకు గురిచేసినందుకు గాను రూ.4వేలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
