విశాఖపట్నం: తుఫాన్ మురసు ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో దక్షిణ కోస్తా రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభావిత ప్రాంతాల్లో నడిచే తొమ్మిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ విస్తృత స్థాయిలో విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టింది.
సోమవారం విశాఖపట్నంలో జనరల్ మేనేజర్ అధ్యక్షతన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు), వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే వంతెనలు, ట్రాక్లు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థలపై 24 గంటల పాటు నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా క్యాచ్ వాటర్ డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలు, మట్టిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, వంతెనల వద్ద పెట్రోలింగ్ సిబ్బంది, వాచ్మెన్లను నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్ల మరమ్మతులకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసే వాతావరణ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు దక్షిణ కోస్తా రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంతో పాటు డివిజనల్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే వార్ రూమ్లను ఏర్పాటు చేశారు.
రద్దయిన రైళ్ల వివరాలు
- 67225 విజయవాడ - గూడూరు ప్యాసింజర్ – నవంబర్ 2న రద్దు.
- 67226 గూడూరు - విజయవాడ ప్యాసింజర్ – నవంబర్ 3న రద్దు.
- విజయవాడ - గూడూరు ఎక్స్ప్రెస్ – నవంబర్ 2, 3 తేదీల్లో ఇరువైపులా రద్దు.
- గుంటూరు - తెనాలి ప్యాసింజర్ – ఇరువైపులా రద్దు.
- తెనాలి - రేపల్లె ప్యాసింజర్ – నవంబర్ 2న రద్దు.
- రేపల్లె - మార్కాపురం ప్యాసింజర్ – నవంబర్ 3న రద్దు.
- మార్కాపురం - తెనాలి ప్యాసింజర్ – నవంబర్ 3న రద్దు.
