అమరావతి: మురసు తుఫాన్ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS) నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పలు శాఖల అధికారులు, సుమారు 45 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ సన్నద్ధతపై సమీక్షించారు.
అర్నబ్ తుఫాన్‌తో పోలిస్తే మురసు తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని సీఎం వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుడమేరు వరదపై ప్రత్యేక నిఘా
నాగార్జునసాగర్, పులిచింతల, బుడమేరు క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. మంగళవారం బుడమేరుకు సుమారు 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.గుండ్లకమ్మ, పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 4వ తేదీన ప్రకాశం బ్యారేజీకి సుమారు 2.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలోని 14,760 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి వరద నీరు చేరే అవకాశమున్నందున గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
వరద ముంపు ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలను తుఫాన్ షెల్టర్లు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. ప్రతి గంటకూ రియల్‌టైమ్‌లో తుఫాన్ హెచ్చరికలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. మొత్తం 848 స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు.గతంలో అర్నబ్ తుఫాన్ సమయంలో ముందస్తు చర్యలతో ప్రజలకు ఇబ్బందులు తగ్గించగలిగామన్న చంద్రబాబు.. ఈసారి ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆస్తి నష్టాన్ని కూడా గణనీయంగా తగ్గించి ప్రజలకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ పునరుద్ధరణకు 5 వేల మంది సిద్ధం
తుఫాన్ ప్రభావంతో గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని సీఎం తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం 5 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు.భారీ వర్షాలు, బలమైన గాలులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది, పరికరాలు, వనరులను ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ఆక్వా, ఉద్యాన పంటలకు రక్షణ
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఆక్వా కల్చర్, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని సీఎం తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జలవనరుల శాఖ, జిల్లా కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.తుఫాన్ తీరం దాటే వరకు క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొంటూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
