నిద్రలోనే కన్నుమూసిన యువ నటుడు అనుజ్ ఠాకూర్.. 33 ఏళ్లకే విషాదాంతం!

నిద్రలోనే కన్నుమూసిన యువ నటుడు అనుజ్ ఠాకూర్.. 33 ఏళ్లకే విషాదాంతం!

బుల్లితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు మృతి చెందారు. హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అనుజ్ ఠాకూర్ (33) నిద్రలోనే కన్నుమూశాడు. అక్టోబర్ 27న చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

అనుజ్ మరణవార్తను ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్, సహనటుడు రూపేష్ సోనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 30న అనుజ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అనుజ్ తనకు స్నేహితుడు మాత్రమే కాదని, సొంత తమ్ముడిలాంటి వాడని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని, ఇంత చిన్న వయసులోనే అతడు దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే అనుజ్ మరణానికి సంబంధించిన వివరాలు మరింత కలచివేస్తున్నాయి. రూపేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుజ్ ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచేవాడు. జిమ్, జాగింగ్‌తో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. కానీ ఘటన జరిగిన రోజు అలారం మోగుతున్నా అతడు నిద్రలేవలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలో ఫిట్స్ రావడంతోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు రూపేష్‌కు వెల్లడించారు.

2007-08లో డిస్నీ ఛానెల్‌లో ప్రసారమైన 'ధూమ్ మచావో ధూమ్'తో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన అనుజ్..'బంధన్ సాత్ జన్మో కా', 'బీంద్ బనూంగా ఘోడి చఢూంగా', 'మహిసాగర్' వంటి సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 'బీంద్ బనూంగా ఘోడి చఢూంగా'లో జై పొద్దార్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇటీవలే రూపేష్‌ను కలిసిన అనుజ్.. మళ్లీ నటనలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేస్తోంది. అతడి మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఓ నటుడి జీవితం ఇలా ముగియడం బుల్లితెర ప్రపంచానికి తీరని లోటుగా మిగిల్చింది.