డిస్నీలో మరోసారి లేఆఫ్స్ కలకలం.. ఖర్చులు 20 శాతం తగ్గించుకోవాలని ప్లాన్

డిస్నీలో మరోసారి లేఆఫ్స్ కలకలం.. ఖర్చులు 20 శాతం తగ్గించుకోవాలని ప్లాన్

అమెరికాకు చెందిన ఎంటర్టైన్మెంట్ సంస్థ 'వాల్ట్ డిస్నీ' మరోసారి ఉద్యోగ తొలగింపులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా.. వేలాది ఉద్యోగాలను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో భాగంగా వార్షిక వ్యయాలను ఏకంగా 20 శాతం మేర తగ్గించుకోవాలని ఆయా విభాగాల మేనేజర్లను డిస్నీ యాజమాన్యం ఆదేశించినట్లు సమాచారం.

సవాళ్లు, కారణాలు:
ప్రస్తుతం డిస్నీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోష్ డి అమారో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడం, థియేటర్లలో కలెక్షన్లు తగ్గడం, స్ట్రీమింగ్ రంగంలో పోటీ విపరీతంగా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో థీమ్ పార్కులకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గటం, AI వినియోగం పెరుగుతుండటం వంటి పరిణామాలు కంపెనీపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.

ఎక్కడెక్కడ కోతలు?
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని డిస్నీ ఆపరేషన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ లేఆఫ్స్ ద్వారా ఆదా అయ్యే నిధులను మళ్లీ చలనచిత్ర, టీవీ ప్రోగ్రామింగ్, టెక్నాలజీ, థీమ్ పార్కులు, క్రూయిజ్ షిప్ వ్యాపారాల వృద్ధి కోసం తిరిగి పెట్టుబడిగా పెట్టాలని జోష్ డి అమారో ప్లాన్ చేస్తున్నారు.

2025 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి డిస్నీలో సుమారు 2లక్షల 31వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లాభదాయకతను పెంచుకునే లక్ష్యంతో డిస్నీ గత కొద్ది సంవత్సరాలుగా క్రమంగా ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో సుమారు 1,000 పోస్టులు.. 2025లో వందలాది ఉద్యోగాలు, అంతకుముందు మాజీ సీఈఓ బాబ్ ఇగర్ హయాంలో 2023లో ఏకంగా 7వేల ఉద్యోగాలను డిస్నీ తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి తొలగింపుల సంఖ్య ఇంకా తెలియనప్పటికీ మెుత్తం ఖర్చులను 20 శాతం తగ్గించాలని మాత్రం సీఈఓ నిర్ణయించారు. కేవలం డిస్నీ మాత్రమే కాకుండా.. నెట్‌ఫ్లిక్స్, స్కైడాన్స్ వంటి ఇతర ప్రముఖ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు కూడా తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇదే బాటలో నడుస్తున్నాయి.