థియేటర్లలోకి రావడానికి ముందే ‘రామాయణ’ (Ramayana)కు పైరసీ సెగ తగిలింది. ఇప్పటికే ట్రైలర్ల లీక్‌తో అలర్ట్ అయిన మేకర్స్.. సినిమా విషయంలోనూ అదే రిపీట్ కాకుండా ముందుగానే కోర్టును ఆశ్రయించారు. దీంతో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాను రహస్యంగా రికార్డు చేయడం, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం వంటి చర్యలపై నిషేధం విధించింది. నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి పైరసీ బెడద లేకుండా కోర్టు ప్రత్యేక రక్షణ కల్పించింది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి గాడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కాపీరైట్ ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మాధవ్ జమ్దార్.. అనధికారికంగా సినిమా కాపీలు చేయడం, డౌన్‌లోడ్ చేయడం, అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
ట్రైలర్ల లీక్‌తో ముందే అలర్ట్..
‘రామాయణ’కు పైరసీ సమస్య కొత్తేమీ కాదు. ప్రైవేట్ స్క్రీనింగ్‌లో ప్రదర్శించిన తొలి ట్రైలర్‌ను కొందరు రహస్యంగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అక్టోబర్ 15న విడుదలైన రెండో ట్రైలర్‌కు సంబంధించిన విజువల్స్ కూడా ముందుగానే లీక్ అయ్యాయి. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు కూడా నమోదైంది. ఇప్పటివరకు పైరసీకి సంబంధించిన వేలాది లింకులను గుర్తించినట్లు హక్కుల సంస్థ కోర్టుకు వెల్లడించింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే చిత్రానికి పైరసీ ముప్పు లేకుండా బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాను రికార్డు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించింది.
లింకులు కనిపిస్తే వెంటనే బ్లాక్ చేయాలి
పైరసీని అడ్డుకునేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా అక్రమ కాపీలు ఉన్న వెబ్‌సైట్లు, మిర్రర్ సైట్లు, వీడియోలు, పోస్టులు, ఇతర లింకులను గుర్తించి తొలగించాలని పేర్కొంది. ఈ తరహా కంటెంట్‌కు సంబంధించిన యూఆర్‌ఎల్‌లను గాడ్‌పవర్ మీడియా ఆయా సంస్థలకు అందించాలి. సమాచారం అందిన వెంటనే వాటిని బ్లాక్ చేయడం లేదా తొలగించడం వంటి చర్యలు తీసుకోవాలి. గూగుల్ సహా పలు డిజిటల్ సంస్థల ప్రతినిధులు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తామని తెలిపారు.
తొలి భాగానికే రూ.2 వేల కోట్లు..
‘రామాయణ’ తొలి భాగానికి రూ.2 వేల కోట్లు, రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు పైరసీ బెడద లేకుండా మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. ఇందులో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. నవంబరు 5న విడుదల కానున్న ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 16న జరగనుంది.
