హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగం, డీప్‌ఫేక్ సమస్యలను అరికట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సినీనటుడు చిరంజీవి కోరారు. కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాను చిరంజీవి, ఆయన కొడుకు నటుడు రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
కళాకారులను కొందరు లక్ష్యంగా చేసుకుని అసభ్యకర రీతిలో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేయడాన్ని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో నటుల హక్కులు, గౌరవం, వారి క్రియేటివ్ కంటెంట్‌కు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం మరింత పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
చిరంజీవి విజ్ఞప్తిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలిస్తుందని, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠిన శిక్షలు అమలు చేసే దిశగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలతో కూడిన రాతపూర్వక వినతి పత్రం సమర్పించాలని సూచించారు.
ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోంమంత్రి సానుకూల స్పందనపై చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. అమిత్ షా ఇచ్చిన హామీ.. చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే కీలక ముందడుగని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించి కళాకారులకు తగిన రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
