హామీలు ఎగ్గొట్టి యాత్రలా? 12 ఏండ్లైనా విభజన హామీల ఊసేది: అమిత్ షాపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్

హామీలు ఎగ్గొట్టి యాత్రలా? 12 ఏండ్లైనా విభజన హామీల ఊసేది: అమిత్ షాపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
  • హైదరాబాద్ వచ్చి యాత్ర చేయడానికి సిగ్గనిపిస్తలేదా?
  • మీకు ఇప్పుడున్న ఎనిమిది ఎంపీ సీట్లూ దక్కవ్
  • అమిత్​ షాపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
  • చొరబాటుదారులకు ఓట్లొస్తే మీరేంచేస్తున్రు: పొన్నం
  • ఐసీయూలో ఉన్నది బీజేపీనే: అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను 12 ఏండ్లుగా అమలు చేయకుండా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టడం ఏమిటని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేయడానికి సిగ్గనిపించడం లేదా అని అమిత్​షాను ప్రశ్నించారు.

బీజేపీ చౌకబారు ప్రసంగాలను వినడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, తమ హక్కులు, నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ అమలవుతోందంటూ తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఎనిమిది ఎంపీ సీట్లు కూడా దక్కవని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో ఎన్ని విడుదల చేశారు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ హామీల పరిస్థితి ఏమిటి? తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏమిటి? రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర గ్రాంట్ల విషయంలో న్యాయం చేశారా? అని అమిత్ షాను మహేశ్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. ఓట్ చోరీ ఆరోపణలపై కూడా అమిత్ షా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల వ్యవస్థపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పదేండ్ల పాలనను కూడా చూశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ బలహీనపడిన తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని, అయితే తెలంగాణ ప్రజలు ఈ రాజకీయాలను అర్థం చేసుకున్నారని అన్నారు.

ఢిల్లీ నుంచి బీజేపీని తరిమికొడతం: విప్ అద్దంకి దయాకర్
రాహుల్ గాంధీ దెబ్బకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీల పేరుతో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. అమిత్ షా హైదరాబాద్ ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కనిపించలేదన్నారు. రాహుల్ గాంధీకి పోటీగా ర్యాలీలు నిర్వహిస్తే స్పందన రాదని, ప్రజల కోసం ర్యాలీలు చేపడితేనే ఆదరణ ఉంటుందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాహుల్ గాంధీ అనే యంగ్ టైగర్ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నది కాంగ్రెస్ కాదని, బీజేపీయే క్రిటికల్ ఐసీయూలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని దింపడం కాదు.. తామే ఢిల్లీ నుంచి బీజేపీని తరిమికొడతామని హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లెందుకు తొలగిస్తున్నరు: పొన్నం
కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విమర్శించడానికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినట్టుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ విభజన హామీలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 

అసలు చొరబాటుదారులకు ఓటు హక్కు ఎలా దక్కిందని, కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా ఏం చేస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారి ఓట్లను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లను తొలగించడంపైనే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు.